calender_icon.png 25 October, 2024 | 1:53 AM

పరీక్షల వైఫల్యం విద్యార్థులకు శాపమే

24-10-2024 11:18:09 PM

నీట్ పరీక్షా పత్రం లీక్, ర్యాంకుల కేటాయింపులో గందరగోళం మరవక ముందే తెలంగాణలో కూడా గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షపై అభ్యంతరాలు, మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసిన విధానం (జీవో నెంబర్ గందరగోళానికి దారితీసింది. దీంతో అభ్యర్థుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత కొంతకాలంగా అకడమిక్ పరీక్షలు, పోటీ పరీక్షలు, రిక్రూట్‌మెంట్ పరీక్షలపై ఏదో ఒక వివాదం ముసురుకొంటూ ఉండడంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత పరీక్షా వ్యవస్థలు, ప్రభుత్వాలు, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపైన నమ్మకం కోల్పోతు న్నారు. ‘పరీక్షలో తప్పిదాలు దొర్లినా, పారదర్శకత లోపించినా, అవినీతి జరిగినా విద్యార్థులు కోల్పోయేది అవకాశం మాత్ర మే కాదు, వారి జీవితం కూడా’ అనే మౌలి క విషయాన్ని పరీక్షలు నిర్వహణ అధికారులు, ప్రభుత్వాలు, ఏజెన్సీలు గుర్తించక పోవటం, గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోక పోవటం విద్యార్థులకు శాపంగా మారిందనే చెప్పాలి.

దశాబ్దాలుగా ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ పరీక్షల నిర్వహణలో, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఒక శ్రేష్టమైన విధానాన్ని అవలంబిస్తుంటే రాష్ట్రస్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు, ఇతర టెస్టింగ్ ఏజెన్సీలు, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ఎందుకు నిర్వహణలో విఫలమవుతున్నాయనే విష యంపై సమీక్ష జరగటం లేదు. వాటి తీరు మార్చుకొని ఒక సమర్థవంతమైన విధానాన్ని రూపొందించుకోలేకపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంపై అణుబాంబులు, మిస్సయిల్స్ వేయనవసరం లేదు. కానీ, ఆ దేశంలో ఉన్న విద్యా ప్రమాణాలను తగ్గించడం ద్వారా పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కి అవకాశం కల్పించటం ద్వారా ఆ దేశాన్ని నాశనం చేయవచ్చని దక్షిణాఫ్రికాలోని విశ్వవిద్యాలయాల ప్రవేశద్వారంపై రాసి ఉంటుంది.  కాబట్టి, ఒక సమర్థవంతమైన లోపాలు లేని పరీక్షా విధానం ఆ దేశంలోని విద్యా వ్యవస్థని పటిష్టం చేస్తుంది.  

ఆదినుంచి అదే ధోరణి 

రాష్ట్రస్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లే ప్రధాన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు. కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’లదే కీలక బాధ్యత. కానీ, చాలా రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ప్రభు త్వ ఉద్యోగాల భర్తీలో వైఫల్యం చెందుతున్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో నాటి ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’పై కూడా అనేక ఆరోపణలు రావటం చూసాం. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదనే విషయం గత దశాబ్ద కాలంగా కనిపిస్తూనే ఉంది. నియామకాలలో జాప్యం, నోటిఫికేషన్ల విడుదలలో ఆలస్యం, పరీక్షా నిర్వహణలలో వైఫల్యం, పరీక్ష పత్రాలలో తప్పులు, కోర్టు కేసులు, అవినీతి లాంటి అంశాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు బయటపడక పోవడం వల్ల సమైక్యాంధ్రలో సర్వీస్ కమీషన్ల పనితీరు ఎలా ఉందో ప్రత్యేక రాష్ట్రంలో కూడా దాని ధోరణి మారలేదు.

దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న పోటీదారులలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై అసహనం, అపనమ్మకం పెరిగిపోతుందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ ఏ ఒక్క పరీక్షనూ వివాదాలకు తావు లేకుండా, ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా పరీక్షలను నిర్వహించిన దాఖలాలు లేవు. ఇటువంటప్పుడు, ఆ వ్యవస్థ సరిగా పనిచేస్తుందని ఎలా నమ్మాలి? ఆ వ్యవస్థపై విద్యార్థులకు ఎలా నమ్మకం కలుగుతుంది? 2022లో నోటిఫికేషన్ విడుదల చేసిన ఒక్క ‘గ్రూప్ మూడు పర్యాయాలు ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. మెయిన్స్ ఎంపికపై కూడా వివాదాలు అలుముకుంటుంటే తుది ఫలితాలు విడుదల చేయటానికి ఎంతకాలం పడుతుందనే సందేహాలు కలగక మానవు.

2011లో విడుదల చేసిన గ్రూప్ నియామకాలు పూర్తి చేయటానికి దాదాపు ఏడు సంవత్సరాల కాలవ్య వధి పట్టింది. దీన్నిబట్టి అప్పటి ‘రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్’ పనితీరును అర్థం చేసుకోవచ్చు. తీరు మారని, గుణపాఠాలు నేర్చుకోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహార శైలిని ఏమనాలి? తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినా పరీక్షల నిర్వహణలో దాని తీరు మారలేదనే విషయం స్పష్టమవుతుంది. ప్రక్షాళన అంటే చైర్మన్‌ని బోర్డు సభ్యులను మార్చడమే కాదు, దాని నిర్వ హణలోనూ మార్పు రావాలి.

నియామకాలు ఎప్పటికో? 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు సహేతుకమైన కారణాల తో పరీక్షలను వాయిదా వేయాలని కోరటాన్ని తప్పు పట్టలేం. కానీ, ఇటీవలి కాలంలో ప్రతి చిన్న కారణానికి ప్రతీ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ పెరగటం భవిష్యత్తు రిక్రూట్‌మెంట్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపెట్టే అవకా శం ఉంటుంది. ఇటీవల టెట్ క్వాలిఫై అయిన వారికి డీఎస్‌సీ రాయటానికి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌లో అవకాశం కల్పిస్తే, ‘మాకు పరీక్షకి ప్రిపేర్ అవటానికి సమయం సరిపోవటం లేదు కాబట్టి, పరీక్షను వాయిదా వేయాలనే’ డిమాండ్ ప్రభుత్వం ముందు పెడుతూ, ఆందోళనలు నిర్వహించారు.

కానీ, ప్రభుత్వం వారి ఆందోళనలు లెక్కచేయకుండా డీఎస్‌సీ పరీక్షలను నిర్వహించింది. కాబట్టే 65 రోజులలోనే నియామకాల ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందజేయగలిగింది. 2022లో విడుదల చేసిన గ్రూప్ ఎగ్జామ్ ఇప్పటికే రెండు పర్యాయాలు వాయిదా వేయటం వల్ల విద్యార్థులు ప్రిపరేషన్‌లో తీవ్ర ఒత్తిడికి గురవుటమే కాదు, విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎప్పుడు పెట్టినా సంసిద్ధులై ఉండటమే కాదు, ప్రభుత్వాలు కూడా నోటిఫికేషన్‌ని జాప్యం లేకుండా విడుదల చేయాలి.  

పారదర్శక వ్యవస్థలతోనే పరిష్కారం

ప్రభుత్వాలు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు వివాదాలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించలేరా? వాటికి ఆ సామర్థ్యం లేదా? అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్ష పత్రంలో దొర్లిన తప్పులు, దరిదాపు తొమ్మిది లక్షలమంది పరీక్ష రాసిన ‘నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్’ ప్రశ్నాపత్రం లీకేజీ, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ప్రిలిమినరీ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల వాయిదాలు, కోర్టు వివాదాలు జీవో నెంబర్ అభ్యంతరాలు వంటివన్నీ చూస్తుంటే వివాదాలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించటంలో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ఇటీవల నీట్ పరీక్షలో దొర్లిన తప్పులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ 0.001 నిర్లక్ష్యం ఉన్నా సరిదిద్దాలని స్పష్టంగా సూచించింది.

ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి సమర్థవంతమైన, పారదర్శకమైన పరీక్షల విధానాన్ని ఏర్పాటు చేయటానికి సూచనలు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ రంగంలో తగ్గిపోతున్న ఉద్యోగాలు పెరిగిపోతున్న పోటీతో ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి, దేశంలో, రాష్ట్రంలో పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉంది.

తప్పులు, వివాదాలు, జాప్యం లేని పారదర్శకమైన వ్యవస్థలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయాలి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు ఉద్యోగాల నోటిఫికేషన్‌తో హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్‌తో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ప్రణాళిక బద్ధంగా జాప్యం లేకుండా భర్తీ చేయాలి. ఇలా, ఉద్యోగ ఉపాధి కల్పనా చర్యలు వేగవంతమవడం వల్ల నిరుద్యోగాన్ని నియంత్రణ చేయడం ప్రభుత్వాలకు తేలికవుతుంది.

వ్యాసకర్త సెల్: 9885465877