calender_icon.png 30 September, 2024 | 5:43 PM

కూల్చాల్సి వస్తే.. హైడ్రా కమిషనర్ కార్యాలయం కూలగొట్టాలె

30-09-2024 04:01:04 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వందరోజుల్లో చేస్తామన్న పనులను 300 రోజులు దాటినా చేయటం లేదని, ఇప్పటివరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మూసీ పరివాహక ప్రజల పాలిటిపట్ల సీఎం రేవంత్ రెడ్డి కాలయముడిగా మారారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మాకు పట్టాలు వచ్చాయని ప్రజలు చెప్తున్నట్లు ఆయన వెల్లడించారు. రిజిస్టేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారు. వందరోజుల్లోనే హామీలన్ని నెరవేరుస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. ఇల్లు అనేది ప్రజలకు ఉద్వేగంతో కూడిన అనుబంధం అని, అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చుతారు.

గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదని, ఎఫ్టీఎల్ లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రాధాన్యతలు ఉన్నాయా..?, కేవలం మూసీపైనే రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తారా..?, 2400 కిలోమీటర్లు ఉన్న గంగనది కోసం కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించారు. కూల్చాల్సి వస్తే మొదట.. హైడ్రా కమిషనర్ కార్యాలయం, ఎఫ్టీఎల్ లోనే నిర్మించిన బద్ధభవన్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కూడా కూల్చాలని కేటీఆర్ చెప్పారు. మూసీ సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుందని కేటీ రామారావు ప్రశ్నించారు. అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కమిషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారు.