calender_icon.png 24 November, 2024 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు

25-09-2024 12:40:17 AM

  1. ఎంసీఐ నిబంధనల మేరకు కల్పిస్తాం
  2. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ప్రస్తుత ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. 2024 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆగస్టు 28న ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు 28న వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఎన్‌ఎంసీ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాల్సి ఉందన్నారు.

రాష్ట్రంలో ఆ ప్రస్తావనే లేకుండా అడ్మిషన్లు కొనసాగుతున్నాయని చెప్పారు. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శ కాలను రూపొందించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లేఖ రాసినా ఇప్పటివరకు చర్యల్లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2024-25విద్యాసంవత్సరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఏజీ ఇచ్చిన ఈ హామీని ధర్మాసనం నమోదు చేస్తూ పిటిష్ప విచారణను ముగించింది.