calender_icon.png 6 October, 2024 | 9:53 PM

ఎంబీబీఎస్‌లో ఈడబ్ల్యూఎస్

06-10-2024 02:09:44 AM

రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై అధికారులు, కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌కు నోటీసులు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మెడికల్ ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించరాదో చెప్పాలంటూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, కాళోజీ నారాయణరావు వైద్యవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సంధ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

కోర్టుకు హామీ ఇచ్చి ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించరాదో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన తరగతుల)లకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చి అమలు చేయకపోవడంపై కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2024 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆగస్టు 28న తాను వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా గత నెల 20న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామన్న అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి హామీని నమోదు చేసిన హైకోర్టు పిటిషన్‌పై విచారణను మూసివేసిందని గుర్తుచేశారు. అయితే మెడికల్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయలేదని తెలిపారు.

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈ మెయిల్ ద్వారా పిటిసనర్ నోటీసులు పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన అధికారులను కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

వాళ్లు స్థానిక కోటా కింద అర్హులే: హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): నిబంధనల ప్రకారం తెలంగాణ లో వరుసగా 4 ఏళ్లు నివాసం ఉండి, అర్హ త పరీక్ష రాసినట్లయితే మెడికల్ అడ్మిషన్ల లో స్థానిక కోటా కింద పరిగణించా లం టూ కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

2019 నుంచి తెలంగాణలో ఉం టూ ఇం టర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినా స్థానిక కోటా కింద పరిగణించకపోవడాన్ని సవా లు చేస్తూ అనమ్తా ఫరూక్ హైకోర్టులో పి టిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పి టిషనర్ పదో తరగతి వరకు దుబాయ్‌లో చదువుకుని, 2019లో తెలంగాణకు వచ్చి ఇక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేశారని తెలిపారు. 4 ఏళ్ల స్థానిక నివాసానికి సంబం ధించి జూలై 17న శేరిలింగంపల్లి ఎమ్మా ర్వో జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రా న్ని అందజేశామని చెప్పారు. అయినా పి టిషనర్‌ను స్థానికేతర కోటా కింద చూప డం చెల్లదని వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివి ఉండటంగానీ, నివాసంగానీ ఉండాలని, దీంతోపాటు నీట్ అర్హత పరీక్ష తెలంగాణలో ఉత్తీర్ణత సాధిం చి ఉండాలని తెలిపింది. దీని ప్రకారం పిటిషనర్ 4 ఏళ్లు తెలంగాణలో నివాసం ఉండటంతోపాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించినందున మెడికల్ అడ్మిషన్ల లో స్థానిక కోటా కింద పరిగణించాలని ఆదేశించింది. 

సీట్ల పెంపు కేసులో అధికారులకు నోటీసులు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్సీ గ్రూప్‌లో సీట్ల పెంపునకు అనుమతించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించినా అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ ఏ శ్రీదేవసేన, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, టీజీ ఈఏపీసెట్ కన్వీనర్ డాక్టర్ బీ డీన్‌కుమార్‌కు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.