calender_icon.png 5 November, 2024 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఘా నీడలో ఈవీఎంలు

15-05-2024 02:03:39 AM

ఎలక్షన్ అబ్జర్వర్, అభ్యర్థుల సమక్షంలో సీల్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి) : హైదరాబాద్ పార్లమెంట్  నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలను డీఆర్ కేంద్రాలలోని స్ట్రాంగ్‌రూమ్‌కు సీల్ వేసి భద్రపరిచామని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తెలిపారు. హైదరాబాద్ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్రీవిద్య సమక్షంలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌రూమ్‌లకు సీల్ వేసినట్లు చెప్పారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు సీఆర్పీఎఫ్ పోలీసులు నిరంతరం నిఘా ఉంచి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

నగరంలోని మాసాబ్ ట్యాంక్ వద్ద గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంలు, నిజాం కళాశాలలో చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, బండ్లగూడలో అరోరా యూనివర్సిటీలో బహదూర్‌పుర నియోజకవర్గ ఈవీఎంలు, అంబర్‌పేట జీడబ్ల్యూఎంసీ గ్రౌండ్‌లో గల డీఆర్సీ సెంటర్‌లో మలక్‌పేట ఈవీఎంలు, యాకుత్‌పురలోని కోఠి ఉమెన్స్ డిగ్రీ, పీజీ కాలేజీలో గోషామహల్ నియోజకవర్గ ఈవీఎంలు, నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో గల డీఆర్సీ సెంటర్‌లో చార్మినార్ నియోజకవర్గ ఈవీఎంలను భద్రపరచి, సీల్ వేసి, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. 

పోలింగ్ డాక్యుమెంట్ల స్క్రూటినీ

పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన డాక్యుమెంట్లను సరిగా నింపారో లేదోనని నిర్దారించుకోవడానికి, మాల్ ప్రాక్టీస్ జరగలేదని నిర్దారించుకోవడానికి డాక్యుమెం ట్లను స్క్రూట్నీ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ చెప్పారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఆర్‌వోల సమక్షంలో నియోజకవర్గాల వారీగా స్క్రూట్నీ చేశారు.

యాకుత్‌పుర నియోజకవర్గంలో 9, 305, 44, 130, 270 పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. చార్మినార్ నియోజకవర్గంలో 8, 81, 22, 27, 137 బూత్‌లను పరిశీలించారు. మలక్‌పేట్ నియోజకవర్గంలో 261, 68, 64, 234, 300పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. బహదూర్‌పురలో 166, 97, 203, 199, 75 పరిశీలించారు. చాంద్రాయణగుట్టలో 136, 199, 88, 40, 210 పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. గోషామహల్‌లో 22, 26, 129, 151, 214 బూత్‌లను పరిశీలించారు. కార్వాన్‌లో 287, 302, 270, 136, 301 పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. 

ఓటింగ్ శాతం పెరిగేలా కృషి 

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లాల కలెక్టర్లు, అధికారులు చేసిన కృషి అభినందనీయమని ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్. బొమ్మరబోయిన కేశవులు అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎ త్తున ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ఆయన మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 

స్ట్రాంగ్‌రూమ్‌కు ఈవీఎంలు

 యాదాద్రిభువనగిరి, మే 14 (విజయక్రాంతి) : ఈవీఎంలను పటిష్టమైన భద్రత మద్యన మంగళవారం భువనగిరి పట్టణ శివారులోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కౌంటర్లలో స్వీకరించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను జిల్లా కేంద్రంలో అరోరా ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సాదారణ పరిశీలకుడు రాబర్ట్‌సింగ్ క్షేత్రమయూమ్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే జండాగే, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌కు సీల్ వేసి భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్‌రూమ్‌కు మూడంచెల పటిష్టమైన సాయుధ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ బెన్‌షాలోమ్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కలెక్టర్

పటాన్‌చెరు, మే 14 (విజయక్రాంతి) : జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఈవీఎం బాక్సు పెట్టెలను ఎన్నికల అధికారులు పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం యూనివర్సిటీలో భద్రపరిచారు. మంగళవారం కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ రూపేశ్ ఎన్నికల అధికారులు, సిబ్బందితో కలిసి గీతం యూనివర్సిటీలో ఈవీఎం బాక్సు పెట్టెలను భద్రపరిచి స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు.

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని ఈవీఎం బాక్సు పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించి సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈవీఎం బాక్సు పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. జూన్ 4వ తేదీన స్ట్రాంగ్ రూంలను తెరచి పెట్టెల్లో ఉన్న ఈవీఎంలను లెక్కించనున్నారు.