బెంగాల్ పోలీసులపై సీబీఐ ఆరోపణలు
కోల్‌కతా, సెప్టెంబర్ 18: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక ఆధారాలు నాశనం కావడానికి బెంగాల్ పోలీసులు సహకరించారని సీబీఐ ఆరోపించింది. ఘటన తరువాత నిందితుడి వస్తువుల ను ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని అను మానం వ్యక్తం చేశారు. తొలుత ఈ ఘటనపై పోలీసులు చేపట్టిన దర్యాప్తుపై అనుమానాలు రావడంతో ఆ కేసును సీబీఐకి హైకోర్టు బదిలీ చేసింది. డాక్టర్‌పై లైంగికదాడి తర్వాత నిందితుడు సంజయ్ దుస్తులను రెండ్రోజులకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొం ది. వెంటనే స్వాధీనం చేసుకుటే సాక్ష్యాలు లభించేవని, కేసులో పురోగతి కనిపించేందని తెలిపింది. కీలక ఆధారాలను నాశనం చేసే ఉద్దేశంతోనే బెంగాల్ పోలీసులు విచారణ మొదలుపెట్టారని ఆరోపించింది.
మరోసారి చర్చలు జరపాలి
బాధితురాలికి పూర్తిగా న్యాయం జరిగే వరకు మరికొన్ని డిమండ్లను వినిపించేందుకు సీఎం మమతాబెనర్జీతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని వైద్యులు కోరారు. అప్పటివరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్‌లను అన్నింటినీ నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్‌కు పంపిన మెయిల్‌లో వారు వెల్లడించారు. డాక్టర్లకు పూర్తి భద్రతతోపాటు ప్రభుత్వం కేటాయించిన రూ. 100 కోట్లను ఎలా ఖర్చు చేయాలనే అంశాలపై చర్చించాలని పేర్కొన్నారు. కాగా హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డాక్టర్లతో సీఎం మమత చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్లు పెట్టిన ఐదు డిమాండ్లలో మూడింటిని ఆమె అంగీకరించారు.