13-04-2025 01:29:24 AM
ఈ రాళ్లు మన చరిత్రకు సజీవ సాక్ష్యం. చూడ్డానికి ఇవి మామూలు రాళ్లు. ఒక్కో రాయి సుమారు 12 అడుగుల ఎత్తున్న నిలువురాళ్లు. ఒకప్పుడు వీటిని చూస్తే ప్రజలకు భయం. కానీ పరిశోధకులకు మాత్రం ఇవి అత్యంత అమూల్యమైనవి! తెలంగాణ, కర్నాటక సరిహద్దుల్లో నారాయణపేట జిల్లా కృష్ణ మండలం కృష్ణానదీ తీరంలో ముడుమాల్ గ్రామ శివార్లలో నిలువు రాళ్లు మనకు దర్శనమిస్తాయి. ఆదిమానవుల ఊహాశక్తికి, మేధస్సుకు ఈ నిలువురాళ్లు ఒక చిహ్నమని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ఆసియాలోనే అత్యంత అరుదైన గండశిలలతో ఏర్పాటు చేసిన గుండ్రటి నిర్మాణాలు. 3000 ఏళ్ల క్రితం నాటి మన పూర్వీకులు ఎన్నో ప్రశ్నలు మిగిల్చిన చరిత్ర ఇక్కడ దాగుంది. గతానికి, వర్తమానానికి మధ్య ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం..
నిలువురాళ్లు బృహత్ శిలాయుగానికి చెందినవి. వీటిలో కొన్ని కాలాలు, రుతువులు తెలుసుకునేందుకు పాతారు. వీటన్నింటినీ సూర్యుడి గతి ప్రకారం పాతారు. ఈ రాళ్లకు సీజన్‌లో సూర్యుడు అభిముఖంగా వస్తాడు. వరుసలుగా పేర్చినవి ఐదువేలు ఉన్నాయి. పెద్దరాళ్లు 80 ఉన్నాయి. వీటిలో వర్షాలకు 20 పడిపోయాయి. ఇలాంటివి మనదేశంలో ఎక్కడా లేవు. బ్రిటన్‌లో స్టోన్ హెంజ్ అని ఉన్నాయి. వాటి తర్వాత మన శిలలే ప్రసిద్ధి. ఈ నిలువురాళ్లను ఉత్తరాయనం, దక్షిణాయనం చూసేందుకు పూర్వీకులు ఉపయోగించారు.
దిక్కులను చూసేందుకు కూడా ఈ రాళ్లు ఉపయోగపడ్డాయి. 2004 నుంచి వీటిపై దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ అధ్యయనం చేస్తున్నది. పరిశోధకులు పలు జర్నల్స్ రాయడమే కాకుండా ఉపన్యాసాలు సైతం ఇస్తున్నారు. వీటిని తెలుసుకుని విదేశాల వాళ్లు వచ్చి అధ్యయనం చేస్తున్నారు. మన పూర్వీకులకు ఖగోళ శాస్త్రం మీద విపరీతమైన అవగాహన ఉందని చెప్పేందుకు నిలువురాళ్లే ఉదాహరణ. దక్షిణాసియాలో అతి పురాతనమైన నక్షత్ర మండలం చిత్రించింది ఇక్కడే. కొరియా, జపాన్ వంటి దేశాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. వాటితో పోలిస్తే మనవే పెద్దవి.
ఆరు ప్రఖ్యాత ప్రాంతాలు..
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్ శివారులో కృష్ణానది ఒడ్డున ఉన్న నిలువురాళ్లు త్వరలో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందే అవకాశముంది. ఈ మేరకు యునెస్కో గుర్తింపును కోరుతూ మన దేశం నుంచి ఆరు ప్రఖ్యాత ప్రాంతాలను ప్రతిపాదించారు. వాటిలో భారతీయుల ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి నిలువుటద్దాలని పేరున్న ముడుమాల్ మెగాలిథిక్ నిలువురాళ్లతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని కంగేర్ లోయ జాతీయపార్కు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలోని కర్నూలు జిల్లా ఎర్రగుడిలో ఒకటి ఉంది, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలోని చౌసట్ (64) యోగినుల వృత్తాకార ఆలయాలు, ఉత్తర భారతంలో గుప్తుల కాలంలో నిర్మించిన ఆలయాలు.
నిలువురాళ్లపై డాక్యుమెంటరీ..
దక్కన్ హెరిటేజ్ గత ఎడాది జూలైలో డిల్లీలో నిలువురాళ్ళపై ఒక డాక్యుమెంటరీని సైతం ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై నిలువురాళ్ల ప్రత్యేకతను తెలియజేస్తు నివేదికను సమర్పించారు. దక్కన్ హెరిటేజ్ సంస్థ 2021 నుంచి వాటిని పరిరక్షిస్తున్నది. ఈ ప్రాంతాన్ని జూపల్లి కృష్ణారావు సందర్శించారు. నిలువు రాళ్ళను ప్రత్యేకంగా గుర్తింపు వచ్చేంత వరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పర్యటించిన సమయంలో పేర్కొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ది జరిగితే రైతాంగం ఎవరైనా నష్టపోతే అవసరమైన నష్టపరిహా రం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జూపల్లి తెలిపారు.
పర్యాటక శోభ వచ్చేనా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అరుదైన ప్రత్యేకతను సంతరించుకున్నది. ఆసియాలోనే అరుదైన గండశిలలుగా చెప్పుకోవచ్చు. పురవాస్తుశాఖ అధికారులు, పలు సంస్థలు నిలువురాళ్ల ప్రదేశానికి అరుదైన గుర్తింపును తీసుకువచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికి ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు. గడిచిన ఎడాదిలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిలువురాళ్లపై రూపొందించిన డాక్యుమెంట్‌ను కేంద్రానికి అందించారు. అందులో భాగంగానే యూనెస్కో తాత్కలిక జాబితాలో నిలువురాళ్లకు చోటు లభించింది. ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే.. నిలువురాళ్ల ప్రాంతం పర్యాటక ప్రదేశంగా ప్రపంచస్థాయిలో చోటు దక్కనుంది.
ఎలా వెళ్లాలంటే?
హైదరాబాద్ నుంచి వచ్చే వారికి నేరుగా మక్తల్ వరకు బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి మక్తల్ వరకు 165 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మక్తల్ నుంచి గుడేబల్లూర్ మీదుగా ముడుమల్ మీదుగా లిఫ్ట్ కెనాల్ నుంచి నేరుగా వెళితే.. అక్కడే నిలువు రాళ్లు ఉంటాయి. మఖ్తల్ నుంచి నిలువు రాళ్ల వరకు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైద్రాబాద్ నుంచి నేరుగా కృష్ణా వరకు ప్రత్యేకంగా రైలు సౌకర్యం సైతం ఉంది.
దక్షిణాసియాలోనే అతిపెద్ద సైట్
నిలువురాళ్లను పరిరక్షించడం, అధ్యయనం, పరిశోధన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఒప్పందం చేసుకున్నది. ఒక విధంగా ఈ ప్రాంతాన్ని ఆర్కియో ఆస్ట్రోనాటికల్ అబ్జర్వేటరీ కేంద్రంగా చూడవచ్చు. ఇటువంటివి ప్రపంచంలో ఏక్కడా లేవు. వీటి ప్రాముఖ్యత ఏంటంటే.. ఒకే దగ్గర కొన్ని ఏళ్ల సంవత్సరాలుగా వందలకొద్దీ గండుశిలలు (నిలువురాళ్లు) ఉండటం. భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియాలోనే అతిపెద్ద సైట్ ఇదే.
ఆదిమానవులు నివసించిన సమయంలో నిలువురాళ్లను పాతారని చరిత్రకారుల అభిప్రాయం. పురావస్తు శాఖ సైతం ఇక్కడ అధ్యయనం చేసి ఆనాటి కాలమాన పరిస్థితులు, వాతావారణ మార్పులను తెలియజేసేందుకు ఈ ప్రాంతం కేంద్రంగా (ఆస్ట్రోనాటికల్ అబ్జర్వేటరీ) ఉండేదని పేర్కొంది. ఇప్పుడు వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు అత్యంత ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉండగా.. ఐదు వేల ఏండ్ల కిందట ఈ నిలువురాళ్ల నీడ ఆధారంగానే అప్పటి ప్రజలు రుతువులు, కాలాలను గుర్తించేది.
సూర్యుడి గమనాన్ని బట్టి పడే ఈ రాళ్ల నీడల ఆధారంగా వాతావరణ మార్పులను గుర్తించేవారు. క్రీ.పూ.500 ఏండ్ల కిందటే ఇక్కడి వాళ్లు స్కె మ్యాప్ తయారు చేసుకున్నారు. అప్పటి స్కై మ్యాప్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. అప్పటి స్కై మ్యాప్, ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించిన ఆధునిక స్కై మ్యాప్‌నకు పోలికలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు తోడ్పడే సప్తర్షి మండలాన్ని ఒక రాతిపై ఆనాడే చెక్కారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది. ఇంతటి విలువైన సంపద ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. వీటిని చూసేందుకు మన వాళ్ల కంటే విదేశాల నుంచే ఎక్కువమంది వస్తున్నారు.
వేదకుమార్ మణికొండ, దక్కన్‌హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్