కన్నెకల్లు గ్రామానికి వెయ్యేళ్లకుపైగా చరిత్ర
- కళ్యాణి చాళుక్యుల కాలంలోనే కర్ణెకోటగా వెలుగులోకి
- కాకతీయుల పాలనలో అద్భుతంగా వెలిగిన ప్రాంతం
- ప్రస్తుతం పూర్తి శిథిలావస్థలో నాటి ఆలయాలు, కట్టడాలు
(రామ్మూర్తి చల్లా) :
నల్లగొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కన్నెకల్లు గ్రామంలో ఉన్న చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఇది అత్యంత పురాతన గ్రామమని అవగతమవుతోంది. 11వ శతాబ్దంలోనే కర్ణెకోట ఉన్నట్లు ఇక్కడి చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కళ్యాణి చాళుక్యుల కాలంలో కర్ణెకోటగా వెలుగొందిన ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజైన రెండో ప్రోలయ రాజు జయించాడు. యుద్ధ నియమాల ప్రకారం కళ్యాణి చాళుక్యులు కర్ణెకోట (పేరూరు ప్రస్తుత హాలియా మండలం), నాగులపాటి అన్నారం (సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్ మండలం), పానగల్లు (నల్లగొండ మండలం), వాడపల్లి (దామచర్ల మండలం) సమూహంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కాకతీయులకు అప్పగించారు.
గణపతిదేవుని కాలంలో..
కాకతీయ రాజ్యాన్ని 1192 మధ్య పాలించిన గణపతిదేవుడు కర్ణెకోట ప్రాంతంలో మల్లికార్జునస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని ఆగ్నేయంగా ఉన్న శ్రీశైలం, ఈశాన్యంలోని వరంగల్ వేయి స్తంభాల గుడిని అనుసంధానంగా నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి నలు దిక్కులా నాలుగు శివాలయాలు నిర్మించారు. ప్రస్తుతం ఇవి పూర్తిగా శిథిలం కాగా మల్లికార్జున స్వామి ఆలయ ఆనవాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. రాణి రుద్రమదేవి తన పాలనా కాలంలో ఈ ప్రాంతాన్ని విడిది కేంద్రంగా వినియోగించుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
ఆకట్టుకునే బావామరదళ్ల బావి
కాకతీయుల చివరి పాలకుడైన రెండో ప్రతాపరుద్రుడి కాలంలో కర్ణెకోటలో బావా మరదళ్ల తొలుగుడు బావి నిర్మింపబడిందని శాసనాలు చెబుతున్నాయి. ఈ బావికి ఆరు ద్వారాలు ఉండడం విశేషం. ప్రత్యేక సందర్భాల్లో బావామరదళ్లు బావిలో స్నానానికి వచ్చినప్పుడు ఒకరికొకరు ఎదురుకాకుండా వెళ్లిపోయేలా ఈ ద్వారాలు ఉన్నాయి. ప్రస్తుతం బావి శిథిలావస్థలో ఉంది. ఇక్కడి నుంచి పానగల్లు వరకు సొరంగ మార్గం ఉన్నట్లు ఇప్పటికీ ఇక్కడి వారు విశ్వసిస్తారు. ప్రభుత్వం బావులను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
నాగుల చెరువుకూ ప్రత్యేక స్థానం..
కన్నెకల్లు నాగుల చెరువుకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. చివరి కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడు కర్ణెకోట ప్రాంతం గుండా శ్రీశైలం వెళ్తుండగా అష్టనాగుల తాండవాన్ని గమనించాడు. ఈ విషయాన్ని తన మంత్రికి వివరించగా దోష నివారణకు అక్కడ చెరువు తవ్విస్తే మంచి జరుగుతుందని సలహా ఇవ్వడంతో 650 ఎకరాల విస్తీర్ణంలో చెరువు తవ్వించాడు. ఇదే నాగుల చెరువు పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈ చెరువులో గతంలో అనేక దేవతామూర్తుల విగ్రహాలు లభించాయి. ఇవి ప్రస్తుతం నల్లగొండలోని పానగల్లు మ్యూజియంలో ఉన్నాయి.
అద్భుతం.. పద్మనాభస్వామి ఆలయం
కాకతీయుల పూర్వమే కర్ణెకోటలో అనంత పద్మనాభస్వామి ఆలయం నిర్మించబడిందని చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయం కింద గుప్త నిధులు ఉన్నట్లు భావించి కొన్నేండ్ల క్రితం కొందరు తవ్వకాలు జరపడంతో పూర్తిగా ధ్వంసమైంది. గ్రామస్తుడు కొలనుపాక కృష్ణారావు ముందుకు వచ్చి ఆలయ అధికారుల సహకారంతో మూల విరాట్‌ను బయటకు తీసి రూ.2 కోట్లు వెచ్చించి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. మల్లికార్జునస్వామి ఆలయ పరిసరాల్లో గతంలో చాలామందికి వెండి నాణేలు దొరికినట్లు స్థానికులు చెబుతున్నారు.
అద్భుత చారిత్రక ప్రాంతం
కన్నెకల్లు ప్రాంతానికి అద్భుత చరిత్ర ఉంది. కల్యాణి చాళుక్యులకు సామంతులుగా కందూరు చోళులు, కాకతీయులు పనిచేశారు. ఇక్కడ వారికి సంబంధించిన అనేక శాసనాలు ఉన్నాయి. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి శాసనం కూడా ఉంది. ఈ ప్రాంతాన్ని త్వరలో సందర్శిస్తాం. పురావస్తుశాఖ ఈ ప్రాంతం విశిష్టతను తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చేస్తే బాగుంటుంది.
డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు,
ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ
వారసత్వ సంపదను కాపాడాలి
కన్నెకల్లు గ్రామంలో పురావస్తుశాఖ అధికారులు పరిశోధన చేస్తే మరిన్ని సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాకతీయుల పాలన కంటే ముందే కర్ణెకోటగా ఈ ప్రాంతానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నందుకు గర్వపడుతున్నాం. త్వరలో గ్రామస్తులం పురావస్తుశాఖ అధికారులను కలుస్తాం. వారసత్వ సంపదను కాపాడాలని కోరతాం.
కన్నెగంటి శ్రీనివాస్,
కన్నెకల్లు గ్రామస్తుడు