calender_icon.png 2 October, 2024 | 11:57 AM

చరిత్రకు సాక్ష్యం.. జోగుళాంబ శక్తిపీఠం

02-10-2024 12:00:00 AM

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబ దేవి తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. క్రీస్తు శతాబ్దం జైనుల కాలం నుంచి యేగాంబ పేరు నుండి జోగుళాంబగా రూపాంతరం చెందింది. జోగుళాంబా అమ్మవారి ఆలయం అతి ప్రాచీనమైనది. క్రీ.శ 7వ శతాబ్దంలో ఈ ప్రాచీనాలయం నిర్మించడం జరిగింది.

అప్పటినుండి వైదిక సంప్రదాయ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఇక్కడ జరిగే దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.  

నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శైలప్రుతి దేవిగా, రెండోరోజు బ్రహ్మచారిదేవిగా, మూడోరోజు చంద్రఘంటాదేవిగా, నాలుగో రోజు కూష్మాండాదేవిగా, ఐదోరోజు స్కందమాతాదేవిగా, ఆరో రోజు కాత్యాయనిదేవిగా, ఏడో రోజు కాళరాత్రిదేవిగా, ఎనిమిదో రోజు మహాగౌరిదేవిగా, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి దేవిగా అమ్మవారికి ఆలయ అర్చకులు అలంకరణ చేస్తారు. 

శైలపుత్రి: నవరాత్రుల్లో శైలపుత్రి అవతారం అంటే శివుడిని పతిగా పొందడానికి కైలాసానికి వెళ్లి మెప్పు పొందిన సతిగా వరాన్ని పొందింది. అందుకే శైల పుత్రిని ఆరాధించడంతో అవివాహితులకు వివాహప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. 

బ్రహ్మచారిణి:  బ్రహ్మ అనగా తపస్సు. బ్రహ్మ భార్య అయిన సరస్వతి శక్తి. రెండోరోజు ఆరాధించడంతో జ్ఞాన అనుగ్రహం కలుగుతుంది. 

చంద్రఘంటాదేవి:  ఈరోజు అమ్మవారిని పారిజాత పుష్పాలతో ఆరాధిస్తారు. అమ్మవారు పది చేతులతో మహిషాసురిడితో యుద్ధం చేసి రాక్షసులను అంతమొందిస్తుంది. అమ్మవారు ఘంటను ఆయుధంగా చేసుకుంటుంది. ఘటనాథం వినగానే రాక్షసులు తమ స్థావరాలకు చేరుకుంటారు. 

కూష్మాండాదేవి:  కూష్మాడం అంటే బ్రహ్మాండానికి సంకేతం. ఆది పరాశక్తిగా చిరునవ్వుతో భూ మండలాన్ని సృష్టించిందని, ఈమెను ఆరాధిస్తే శతభాధలు తొలిగి మానసిక ప్రశాంతత చేకూరడమే కాకుండా విజయం కూడా లభిస్తుంది. 

స్కందమాతాదేవి:  స్కందమాత అంటే కుమార స్వామికి తల్లిలాంటిది. దుస్వప్నాలను నాశనం చేసే శక్తి స్కందమాతకు మాత్రమే ఉంటుంది. ఈమెను ఆరాధించే వారికి నిగ్రహశక్తి అధికంగా ఉంటుంది. 

కాత్యాయినీ దేవి: కాత్యమహర్షి తపస్సు ఫలితంగా కాత్యాయిదేవి జన్మించిందని అందుకే అమ్మవారికి కాత్యాయినీ పేరు వచ్చిందని ఈ మాతను ఆరాధించడం వ్రతం చేయడంతో ఇష్టదైవంతో పోలిన భర్తలు లభిస్తారని దేవి భాగవతం ద్వారా తెలుస్తుంది. 

కాళరాత్రి దేవి:  దుష్టులకు భయంకరంగా కనిపించే అవతారం కాళరాత్రి అవతారం. ఈ రోజు అమ్మవారికి కుడి చేతిలో అభయముద్ర, ఎడమ చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఇనుప ముళ్లు ఉన్న ఆయుధం, మెడలో ఇనుప గొలుసులు కలిగి ఉంటుంది. అత్యంత భయంకరంగా కనిపించే అమ్మవారు నల్లటి ముఖంతో ఎరుపెక్కిన కండ్లతో రాక్షసులకు సైతం భయం కలిగిస్తుంది. 

మహాగౌరి దేవి:  అమ్మవారిని మహాగౌరిగా అలంకరించి ఆరాధిస్తారు. అర్థనారి స్వరూపం, సృష్టికేళి విలోలుడైన తాండవమేర్తిని తమ అవర్ణరూపంలో తపస్సు చేసి ఈశ్వరుడిని వరంగా పొందుతుంది. అందుకే ప్రతి పెండ్లి కూతురు తప్పనిసరిగా గౌరిపూజ చేసి మాంగళ్యధారణ యోగత్యను పొందుతారు. 

సిద్ధిదాత్రిదేవి:  ఏ ఫలాన్ని ఆశించి వత్రం చేస్తామో ఆ ఫలితాన్ని అనుగ్రహించే దేవతగా సిద్ధిదాత్రి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి ఆరాధనతో నవరాత్రి ఫలితం నెరవేరుతుంది. 

 గద్వాల (వనపర్తి), విజయక్రాంతి