calender_icon.png 30 September, 2024 | 11:02 AM

మాది అంతా పారదర్శకమే

29-09-2024 02:14:00 AM

బీఆర్‌ఎస్ పార్టీ, పత్రిక అసత్య ప్రచారాలపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): తమది ప్రజా ప్రభుత్వమని, దాపరి కాలు, రహస్యాలేవీ ఉండవని.. ప్రతిదీ పారదర్శకంగానే జరుగుతుందని ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచే శారు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ఒత్తిడి, రాజీ పడకుండా పనిచేస్తుందని, ఇలా పనిచేయడం బీఆర్‌ఎస్ పార్టీకి, వారి యాజమాన్యంలోని పత్రికకు నచ్చకనే అసత్య ప్రచారం చేస్తుందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బిల్లుల విడుదలలో ఆర్థి క శాఖ 7 శాతం, 8 శాతం, 20 శాతం కమీషన్లు తీసుకుంటుందంటూ దుర్మార్గమైన వార్తా కథనాన్ని వండి వార్చడం న్యాయమనిపించుకోదని తెలిపారు. తాము అధికారం లోకి వచ్చిన ఈ 9 నెలల్లో చూపించడానికి తప్పు కనిపించకున్నా, అర్థం లేని నిందలతో బురద జల్లాలనుకోవడం జర్నలిజం విలువలను దిగజారుస్తుందని విమర్శించారు.

సూటిగా, ఆధారాలతో బయటపెట్టాలి కానీ పత్రిక ప్రస్తావించిన విషయాల్లో ఎక్కడా ఆధారాలు ఉన్నట్టు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే గుసగుసలు వినిపిస్తున్నాయి.. భోగట్టా వంటి బలహీన పదాలను వాడటంలోనే వారి ఉద్ధేశం తెలుస్తోందని మండిపడ్డారు.

సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కువ ఖర్చు చేస్తున్నందువల్ల నిధుల కొరత ఉన్న మాట నిజమేనని, కమీషన్ల కోసమే బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందనేది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. ఇటీవల క్యాబినేట్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయమై ఎలాంటి ప్రస్తావన రాకున్నా.. మంత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్టు రాయడం దారుణమని పేర్కొన్నారు.

ఏవైనా ఆరోపణలొస్తే సంబంధిత మంత్రి వివరణ కోరాలని, నిర్ధారించుకున్న తర్వాతే వార్త రాయడమనేది నైతికత అనిపించుకుంటుందని తెలిపారు. తాము ప్రజలను నమ్ముకున్నామని, ఇలాం టి బురదజల్లే రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు.