18-03-2025 01:17:19 AM
లక్షెట్టిపేటలో ఏర్పాటు చేస్తే రెండు మండల వాసులకు మేలు.
దశాబ్ధాలుగా నెరవేరని మండల ప్రజల కోరిక లక్షెట్టిపేట, మార్చి 17 : అసలే వేసవి కాలం... అగ్గిరాజుకుందా..! కాలి బూడిద అవడం ఖాయం... అని స్థానిక ప్రజలు, మండల వాసులు వాపోతున్నారు... గతంలో నియోజక వర్గంగా.., తాలూకాగా... ఉన్న లక్షెట్టిపేట ఇప్పుడు కేవలం మున్సిపాలిటీ ప్రాంతంగా ఉండిపోయింది. ఈ మండ లాన్ని ఆనుకొని దండేపెల్లి, హాజీపూర్ రెండు మండలాలు ఉన్నా కూడా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని రాజకీయ నాయకులకు, అధికారులకు ప్రజలు దశాబ్ధాలుగా వేసుకుంటున్నారు.
లక్షెట్టిపేట మండ లంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామంలోనైనా అగ్ని ప్రమాదం జరిగినా ఫైర్ సిబ్బంది మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నా రం మండలాల నుంచి వచ్చే సరికి ఆలస్యమై ఆస్తి నష్టం భారీగా వాటిల్లుతుంది.
జిల్లాలోనే అతిపెద్దదైన ఎల్లంపల్లి జలాశయం ఆయకట్టు కింద ఏటా రైతులు వరి సాగు అధికంగా సాగు చేస్తారు. పశుగ్రాసమైన గడ్డి వాములు ప్రమాదవశాత్తు జరిగే అగ్నిప్రమాదాలకు కాలిపోతున్నాయి. కావున ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
లక్షెట్టిపేటకు ఎటు చూచినా 30 కిలో మీటర్ల దూరంలోనే అగ్ని మాపక కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో ఈ మండల కేంద్రానికి అగ్నిమాపక కేంద్రం మంజూరు చేస్తామని హామీలు ఇచ్చిన రాజకీయ, సంబంధిత అధికారులు విస్మరించిన విషయం తెలిసిందే.
పెద్ద ప్రమాదాలు...
గత ఏడాదిలో వివిధ గ్రామాల్లోని గడ్డివాములు, పట్టణంలోని బీట్ బజార్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఎస్ బీ ఐ ఉత్కూర్ బ్రాంచ్ లలో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు ఎగిసిపడి సంబంధిత ఫైల్స్ దగ్ధమయ్యాయి. 30 కిలోమీటర్ల దూరాన ఉన్న మంచిర్యాల, జన్నారంల ఫైర్ ఇంజన్ లు లక్షెట్టిపేటకు వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదే విధంగా ఈ నెలలో దండేపల్లి మండలంలోని నంబాల గ్రామ పంచాయతీ ఒకరి ఇల్లు ఖాళీ బూడిదైంది.
ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లడంతో ఆ కుటుంబ లబోదిబోమన్నారు.గతంలో కూడా మంటలు అంటు కోవడంతో ఆస్తినష్టం జరిగిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. దూరాన ఉన్న మంచిర్యాల, జన్నారం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చే సమయం ఆలస్యం కావడంతో ఆస్తినష్టం భారీగా జరుగుతుంద న్నారు. ఇప్పటికైన పాలకులు స్పందించి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.