10-03-2025 12:57:14 AM
బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు నిజాలే మాట్లాడాలి
21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చారు?
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్‌గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శిం చారు. బాధ్యయుతమైన పదవిలో ఉండి జవాబుదారీతనంతో నిజాలు మాట్లాడాలి కానీ రేవంత్ అబద్ధాలకు కేరాఫ్‌గా మారారని ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ సర్కారుపై అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికారంలో ఉండి అదే ధోరణిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు మోసం చేశాడని తెలిపారు.
మూడు, నాలుగు వేల కోట్లకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, మిగతా రూ.16 వేల కోట్లకు 12 శాతం చొప్పున మహిళా సంఘాలు వడ్డీ చెల్లిస్తున్నాయన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పెంచుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 లక్షల పరిమితి వరకే వడ్డీ లేని రుణాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని మహిళలందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
రూ.21 వేల కోట్లు మొత్తం వడ్డీ లేని రుణాలే అయితే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. స్కూల్ యూనిఫామ్‌లను మహిళా సంఘాలకు ఇచ్చామని డబ్బా కొడుతున్నారని.. కుట్టుకూలిగా తమ ప్రభుత్వం జతకు రూ.50 చెల్లిస్తే.. దాన్ని రూ.75 పెంచినట్టు చెబుతూ రేవంత్ పచ్చి అబద్ధం ఆడారన్నారు.
నిజానికి జతకు ఇచ్చేది రూ.50 మాత్రమేనని తెలిపారు. ఒకవేళ జత కుట్టు కూలి రూ.75 ఇచ్చింది నిజమే అయితే ఏ ఊళ్లో ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు. పీఎం మత్స్య సంపద యోజన కింద 60 శాతం సబ్సిడీ వస్తే, మిగతా 40 శాతం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రుణం తీసుకొని కొనుగోలు చేసే మొబైల్ ఫిష్ వ్యాన్లను కూడా తమ ఘనతగా చెప్పుకుంటున్నారని రేవంత్ సర్కార్‌ను హరీశ్ దుయ్యబట్టారు.
ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా 2024, నవంబర్ 7న వరంగల్‌లో రూ.35 కోట్ల చెక్కును మహిళా సంఘానికి అందించారని, అది క్లియర్ కాకుండా 3 నెలల తర్వాత లాప్స్ అయ్యిందన్నారు. దానికి ఇంకో రూ.9 కోట్లు కలిపి, మళ్లీ నిన్న రూ.44 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు ఇచ్చారని.. ఇప్పుడైనా చెక్ పాసవుతుందా? లేదా ఇదే డ్రామా కొనసాగుతుందా అని ప్రశ్నించారు. సాక్షాత్తు సీఎం ఇచ్చిన చెక్కే డమ్మీ చెక్కు అయ్యిందని ఎద్దేవా చేశారు.