* రెండోపంటకు రైతుబంధు ఇవ్వకుండా సర్కారు కుట్ర
* మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారని, రైతు రుణమాఫీ విషయంలో ఆయన బండారం బయటపడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ఉద్ధరించింది ఏమీలేదన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ని నీడలాగా వెంటాడుతామన్నారు. రుణమాఫీ కోసం కాంగ్రెస్ ఇచ్చింది కేవలం రూ.12వేల కోట్లే అని, పదేళ్లలో బీఆర్‌ఎస్ రూ.28వేల కోట్ల రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు.
సీఎం సొంత గ్రామానికి వెళ్లినా రుణమాఫీ విషయంపై స్పష్టత వస్తుందన్నారు. వర్షాభావ పంటలైన కంది, పత్తి, మొక్కజొన్న (రెండో పంట)కు రైతుబంధు ఇవ్వకుండా కుట్రచేస్తున్నారన్నారు. రైతు ఆత్మహత్యలపై కూడా అబద్ధాలు చెప్పే దుస్థితికి కాంగ్రెస్ దిగజారిందని విమర్శించారు. రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలు కూడా అమలు చేశాయన్నారు.