- వాణిజ్య పన్నుల శాఖ కీలకాధికారి యవ్వారం
- ఛార్జ్ తీసుకోగానే రూ.2 కోట్లతో చాంబర్ మరమ్మతు
- అనుమతి లేకుండా నిర్మాణాలు.. 65 లక్షలతో కొత్త కారు!
- పనులు పూర్తవ్వకుండానే నిధులు విడుదల చేయించుకున్న వైనం
- చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఉద్యోగుల ఆరోపణలు
- 16 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్న హైర్ వెహికిల్స్ డ్రైవర్స్
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం సర్కారుకు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, రూపాయి రూపాయి ఆదా చేసుకోవాలని ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కానీ, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి మాత్రం ఆ ఆదేశాలు బుట్టదాఖలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో కీలక బాధ్యతలు చేపట్టిన ఆ ఉన్నతాధికారి.. వచ్చీ రావడంతోనే తన చాంబర్ మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఏకంగా రూ.2 కోట్లతో పనులు ప్రారంభించారు. అయితే, ఆ పనులు చేపట్టడానికి కనీసం అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. తానే బాస్ అని, తనకు ఎవరు అడ్డు అనే ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది.
లెక్కా లేదు.. పత్రం లేదు!
ఆరు నెలల క్రితం చాంబర్ మరమ్మతు పనులు ప్రారంభించినట్టు ఉద్యోగులు చెప్తున్నారు. అయితే, ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అడపాదడపా పనులు చేశారని, ఎలక్షన్ల సమయంలో ఆపేశారని ఉద్యోగులు తెలిపారు. పనులు పూర్తి కాకపోయినా.. మరమ్మతులకు కేటాయించిన మొత్తం రూ.2 కోట్లను ఆర్‌అండ్‌బీలో ఉన్న కీలకాధికారితో చెప్పించుకొని విడుదల చేయించుకున్నట్టు తెలిసింది. అలాగే, ఆ నిధులకు ఎలాంటి బిల్లులు లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ధైర్యం చేసి బిల్లుల గురించి అడిగితే.. ఆ ఉన్నతాధికారి బెదిరిస్తున్నారని చెప్తున్నారు.
65 లక్షల కారు కుటుంబానికా?
ఛార్జ్ తీసుకోగానే ప్రభుత్వ సొమ్ముతో సదరు ఉన్నతాధికారి రూ.65లక్షలతో లగ్జరీ కారును కొన్నారు. కానీ, ఆ అధికారి లగ్జరీ కారును ఆఫీస్ అవసరాలకు కాకుండా కుటుంబ సభ్యుల అవసరాల కోసం వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం కూడా ఆ ఆధికారి లగ్జరీ కారులో కాకుండా ఇతర వాహనంలో ఆఫీసుకు వచ్చినట్టు చూసిన ఉద్యోగులు పేర్కొన్నారు.
పోస్టింగ్ అక్కడ.. ఉద్యోగం ఇక్కడ
వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో జోనల్ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చినట్టు తెలుస్తోం ది. ఎలాంటి ఆర్డర్లు లేకుండా నిజామాబాద్ నుంచి ఓ అధికారి హైదరాబాద్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నట్టు ఉద్యోగులు చెప్తున్నారు. ఆ అధికారి వారానికోసారి నిజామా బాద్‌కు వెళ్లి, ఐదు రోజులు హైదరాబాద్‌లో పని చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఆ జిల్లాలో వాణిజ్య పన్నుల వసూళ్లపై ప్రభా వం చూపినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారి అండదండలతోనే ఇదంతా జరగుతున్నట్టు ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ నుంచి వచ్చిన ఆ ఆఫీసర్.. ఉన్నతాధికారిని తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
16 నెలలుగా వేతనాలు బంద్..
రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో దాదాపు 400 మంది హైర్ వెహికిల్స్ డ్రైవర్స్ ఉన్నారు. వీరికి దాదాపు 16 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. డ్రైవర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. జీతాలు రాక అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నారు. బంగారం కుదువపెట్టి కిస్తీలు కడుతున్నారు. ఉన్నతాధికారి కోట్ల రూపాయిలను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ, తమకు జీతాలు ఇవ్వడానికి లేవా? అని డ్రైవర్స్ ప్రశ్నిస్తున్నారు.