14-03-2025 12:00:00 AM
ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతదేశంలోనూ, దశాబ్దపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు మెజార్టీ ప్రజలైన బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయనే భావన ఆ వర్గాల నుంచి వ్యక్తమవు తోంది. ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల లో, రాజకీయ అధికారిక అవకాశాల కల్పనలో, విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనలో, వ్యాపార రంగాలలో బలహీనవర్గాలకు అన్నింటా అన్యాయమే జరిగిందనే భావన బలహీనవర్గాలలో కలుగుతోంది.
బలహీన వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు పథకాలు అవసరం లేదని, సాధారణ అభివృద్ధిలో భాగంగానే బలహీనవర్గాలు కూడా అభివృద్ధి చెందాల ని పాలకులు, పార్టీలు, ప్రభుత్వాల భావనే దేశంలో, రాష్ట్రంలో బలహీనవర్గాల దశాబ్దాల వెనుకబాటుకు కారణం. కాకా కలేల్క ర్, మండల్ కమిషన్ రిపోర్ట్‌లను, జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్టును అమలు చేయటానికి సిద్ధపడకపోవటం అంటే మెజార్టీలై న బలహీన వర్గాల పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుంది.
బీసీల అభివృద్ధ్ధి, సం క్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఒకే విధంగా ఉండటం మరీ విచిత్రంగానే కనిపిస్తుంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా నేటి కాంగ్రెస్ ప్రభు త్వం పార్టీగా ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్, కులగణన లాంటి హామీలు బీసీలలో ఆశలను రేకెత్తించాయి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సమైక్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయం తెలంగాణలోనూ కాంగ్రెస్ హయాంలో కూడా కొనసాగుతోందా అనే అనుమానపు బీజాలు బలపడుతున్నాయి.
అనుమానాలు రేకెత్తించిన కులగణన
బీహార్ తరువాత దేశంలో కులగణన చేపట్టిన రెండవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చరిత్ర కెక్కింది కానీ కులగణన రిపో ర్టు బయటపెట్టిన తర్వాత రాష్ట్రంలో మెజా ర్టీ వర్గాలైన బలహీనవర్గాలు కులగణన రిపోర్టు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిపోర్టులో బీసీల జనాభాను, వారి జనాభా శాతాన్ని తక్కువ చేసి చూపించారనే ప్రధా న విమర్శ బీసీల నుంచి వ్యక్తమవుతోంది. కుల గణనను స్వాగతించిన బీసీలు రిపోర్టులో బీసీల జనాభా శాతం 46.25 శాతం చూపించటాన్ని స్వాగతించలేకపోతున్నారు.
నాటి ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వేకు, నేటి ప్రభుత్వ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు వ్యత్యాసం ఉండటం, బీసీల జనా భా 51 శాతం నుండి 46 శాతానికి తగ్గిపోవటాన్ని బలహీనవర్గాలు అంగీకరించలేక పోతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వేకంటే మా సర్వేలో శాస్త్రీయత ఎక్కువ అని ప్రభు త్వం చెబుతున్న మాటలను బీసీలు విశ్వసించలేకపోతున్నారు. కులగణన రిపోర్టు ఆమోదయోగ్యం కాదని బీసీలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నా వాటిని పరిగణలో కి తీసుకోకుండా ప్రభుత్వం, స్వయంగా సీఎం విమర్శలు చేయటంతో ప్రభుత్వం తన తప్పిదాల నుంచి తప్పించుకో చూస్తుందనే అభిప్రాయం కలుగుతోంది.
బడ్జెట్ కేటాయింపులలో..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన 10 బడ్జెట్‌లలో బీసీల సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువ ఆ కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ప్రభుత్వం ఖర్చు చేయటం లేదు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నా బీసీల సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువనే చెప్పాలి. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభా సంక్షేమానికి సగటున ప్రతి బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు మాత్రం 3 శాతం కంటే తక్కువ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన మేరకు మొదటి బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 20 వేల కోట్ల రూపాయలను కాకుండా కేవలం 9,300 కోట్ల రూపాయలనే కేటాయించటం జరిగింది కానీ ఇటీవల ఏపీ బడ్జెట్‌లో మాత్రం బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలను కేటాయిస్తే మరి 2025- 26 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు 20 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తుందా లేదా మరోసారి మాట తప్పు తుందో బడ్జెట్ వరకు వేచి చూడాల్సిందే.
సంక్షేమ పథకాల అమలులో..
సంక్షేమ పథకాలను అమలు చేయటం లో, వాటికి నిధులు కేటాయించటంలో, ఖర్చు చేయటంలో కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత గొర్రెల పంపిణీ జరగనే లేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రకటించిన బీసీ బంధు పథకం అట కెక్కింది. బీసీ సబ్ ప్లాన్, సంచార జాతుల కార్పొరేషన్ల ప్రస్తావనే లేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోతున్నా పట్టించుకోరు. గత ప్రభు త్వం బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు కేటాయిం చే నిధులలో కోత పెడితే కాంగ్రెస్ ప్రభు త్వం కార్పొరేషన్‌లకు కేటాయించిన నిధులలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయటం లేదు. 2017-18 బడ్జెట్‌లో ఒక్క ఎంబీసీ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తే 2022- 23 బడ్జెట్ నాటికి ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించే నిధులను 300 కోట్ల రూపాయలకు తగ్గిం చారు. 2017 నుంచి బీసీలకు ఇచ్చే వ్యక్తిగత సబ్సిడీ రుణాలను పూర్తిగా నిలిపివేశారు.
అధికారం, -అవకాశాలలో..
సమైక్యాంధ్రప్రదేశ్‌లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీలకు అధికారం అందని ద్రాక్షలాగే కనబడుతోంది. మొత్తం 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే ఒకే అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన 12 మందికి ముఖ్యమంత్రులుగా అవకాశం దక్కితే బీసీ సామాజిక వర్గాలకు ఏడు దశాబ్దాలలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా అవకాశం దక్కనే లేదు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలలో బీసీలకు అధికారం, అధికారంలో అవకాశా లు పెద్దగా దక్కటం లేదు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా 6 నుండి 8 మందికి అవకాశం దక్కాలి కానీ కేసీఆర్ మంత్రివర్గంలో నలుగురికి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరికి మాత్రమే మంత్రులుగా బీసీలకు అవకాశం దక్కింది.
శాస నసభలో జనాభా పరంగా బీసీలకు 50 నుంచి 60 మందికి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం దక్కాలి కానీ గత శాసనసభలో 23 మంది బీసీలు శాసనసభ్యులుగా ఉంటే ఈ శాసనసభలో మాత్రం ఆ సంఖ్య 21కి తగ్గిపోయింది. అధికార కాంగ్రెస్ నుంచి బీసీ శాసనసభ్యులుగా గెలిచింది ఎనిమిది మంది మాత్రమే. శాసనసభ్యులుగా పోటీ చేయడానికి ఏ పార్టీ కూడా బీసీలకు అవకాశం ఇవ్వటానికి ముందుకు రావడం లేదు. 40 మంది శాసనమండలి సభ్యులు ఉంటే మండలిలో ఇటీవల ఎన్నికైన నలుగురితో కలిపి బీసీల ప్రాతినిధ్యం 11 మాత్ర మే. రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల ఎంపికలో, నామినేటెడ్ పదవుల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యా యం చేస్తూనే ఉన్నాయి. అత్యంత వెనుకబడిన కులాలకు, సంచార జాతులకు ఏ ఒక్క అవకాశం ఇవ్వటానికి ఏ ఒక్క పార్టీ, ప్రభు త్వం కూడా ముందుకు రాకపోవడం సా మాజిక న్యాయానికి తూట్లు పొడవటమే.
ప్రభుత్వ వైఖరి ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. ఆ డిక్లరేషన్‌లో పొందుపరిచిన హామీలకు కట్టుబడి బీసీలకు న్యాయం చేస్తుందా లేక గత ప్రభుత్వ పాలకుల వైఖరినే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరి స్తుందా అనేది వేచి చూడాలి. నిధుల కేటాయింపులో, సంక్షేమ పథకాలలో అధికారం లో అవకాశాలలో దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది కాబట్టి ఇటీవల జరిగిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటిసారి బీసీ వాదం ఎన్నికల నినాదంగా మారింది. బీసీ అభ్యర్థులు ఓట్ల పరంగా ఆ ఎన్నికలలో తమ సత్తా చాటారు కాబట్టే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అనివార్యంగా అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో తెలంగాణలో బలహీన వర్గాలు తమ దశాబ్దాల వెనుకబాటు తనంపై ఉద్యమ బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- వ్యాసకర్త సెల్: 9885465877