28-04-2025 12:36:04 AM
చర్ల, ఏప్రిల్ 27: తెలంగాణ, ఛతీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్లల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల వేట గత ఆరు రోజులుగా సాగుతూనే ఉన్నది. అయినా కూడా ఎలాంటి విషయాలు బహిర్గతం చేయకుండా రహస్యంగానే ఉంచుతు న్నారు. భద్రతా బలగాలకు మావోయిస్టులు చిక్కలేదని తెలుస్తున్నది. అసలు ఆ కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారా? లేదో తెలియాల్సిఉంది.
శనివారం వరకు వెంకటాపురం నుంచి ఆపరేషన్ కొనసాగించగా.. ఆదివారం వెంకటాపురం నుంచి ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లినట్టు తెలుస్తున్నది. ఆదివారం వెంకటాపురంలో భద్రతా బలగాల హడావుడి కనిపించలేదు. కర్రెగుట్టల విషయంలో మా వోయిస్టులు లేఖ వదిలినప్పటి నుంచి ఇప్పటివరకు అటవీ ప్రాంతాన్ని సుమారు పది వేల మంది బలగాలు మోహరించినట్లు వార్తలు వినిపించాయి.
కర్రెగుట్టల్లో తొలుత మూడు వేల మంది మావోయిస్టులు ఉన్నారని ఆ తర్వాత రెండు వేల మంది ఉంటార ని అంచనా వేశారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో వెయ్యి మంది మావో యిస్టులు మాత్రమే ఉంటారనే వార్తలు వినిపించాయి. అయిఏ ప్రస్తుతం అక్కడ మావో యిస్టులు లేరనే సమాచారం తెలుస్తున్నది. మావోయిస్టుల కోసం ఆపరేషన్‌లో పాల్గొ న్న భద్రతా బలగాలకు ఆరోగ్య సమస్యలు ఎదరుయ్యాయి. సుమారు 40 మంది డిహైడ్రేషన్‌తో ఆసుపత్రి పాలయ్యారు.
మావోయిస్టులు తప్పించుకున్నారా?
కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారా లేక కావాలనే లేఖ వదిలి చాకచక్యంగా తప్పించుకొని పథకం ప్రకారం ఇక్కడికి భద్రతా దళాలను రప్పించారా అనేది సందిగ్ధంగా ఉంది. కర్రెగుట్టల్లో ఆపరేషన్ చేపట్టి ఆరు రోజులు గడుస్తున్నా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పటికీ వేట కొనసాగుతూనే ఉన్నది. అయితే ఇదంతా మావోయిస్టు అగ్ర నాయకులు ప్రణాళిక అయి ఉంటుందని తెలుస్తోంది. పోలీసులను ఈ కర్రెగుట్టల వైపు మళ్లించి, అంతకంటే ముందే సేఫ్‌జోన్‌లోకి వెళ్లి ఉండవచ్చునని తెలుస్తున్నది.
భద్రతా బలగాల సాహసం
కర్రెగుట్టలు సుమారు 250 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. ఈ కొండలు అన్ని కలిపి సుమారు 30, 40 ఉంటాయి. నల్లని రాళ్లతో ఉండటం వల్ల వీటిని కర్రెగుట్టలు అంటారు. చీకటి గుట్టలు అని కూడా పిలుస్తారు. నిటారుగా ఉండే ఈ కొండలను అధిరోహించడం అంత సులువుకాదు. అయినప్పటికీ భద్రతా దళాలు సాహసోపేతంగా కర్రెగుట్టలను ఎక్కుతూ గుట్టలపైన రహస్యాలు చేదిస్తున్నారు.
రహస్యంగా ఆపరేషన్ జరుగుతుండటంతో వార్త సంస్థలు రకరకాలుగా వార్తలను ప్రచారం చేస్తున్నాయి. వీటన్నిటిని పోలీసు ఉన్నత అధికారులు ధృవీకరించకపోవడం శోచనీయం. కర్రెగుట్టల ఆపరేషన్ మరికొద్ది రోజుల్లో ముగుస్తుందా? మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నారా? లేదంటే భారీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందా? కాల్పుల విరమణకు అవకాశం ఉందా అనేది కొన్ని రోజుల్లో కొలిక్కివచ్చే అవకాశముంది.
ఆరు బాంబులు నిర్వీర్యం
చర్ల సరిహద్దు, ఛత్తీస్‌గఢ్‌లోని సాల్హీబాట్ అడవిలో ఆదివారం సైనికులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మూడు నాగ్‌కుక్కర్ బాంబ్, రెండు నోస్ పైప్ బాంబ్, ఒక నాగ్ టిఫిన్ బాంబ్, ఒక నాగ్ వాకీ-టాకీలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ (బీడీ ఎస్) బృందం ఆరు డంపింగ్ బాంబును నిర్వీర్యం చేశాయి.
ఇదంతా ఖల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చమంద-సల్హెబాట్ అడవుల్లో ఒక బాంబును శోధన సమయంలో సైనికులు స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేశారు. ఏఎస్పీ శైలేంద్ర పాండే నాయకత్వలో ధామ్తారి బృందం, ధామ్తారి నగరం, కేఫ్ ఖల్లారి బృందం పోలీస్ స్టేషన్ ఖల్లారి చమండ, సాల్హీబాట్ ప్రాంతంలో శోధన ఆపరేషన్ కోసం బయలుదేరింది.