29-03-2025 07:48:13 PM
మార్చి 30 నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు కన్నులు పండుగగా బ్రహ్మోత్సవాలు..
భద్రాచలం (విజయక్రాంతి): అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడి కళ్యాణానికి బ్రహ్మోత్సవాలు ఉగాది పండుగ నుండి ప్రారంభం కానున్నాయి. ప్రపంచ ప్రజానీకానికి ఆదర్శప్రాయులైన సీతారాముల కళ్యాణమునకు పేరు గాంచిన భద్రాద్రిలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రధానంగా రెండు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో మొదటిది శ్రీరామనవమి, రెండవది ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రధానంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ వేడుకకు లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం దేవస్థానం, జిల్లా అధికార యంత్రం ఆ స్థాయిలో విస్తృత ఏర్పాటు చేస్తున్నారు.
ఏప్రిల్ 6 న జరిగే సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7 న జరిగే పట్టాభిషేకం వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీరామనవమి ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దేశంలోని నలుమూలల నుంచి భద్రాద్రి కి వచ్చే భక్తుల కోసం ఎలాంటి లోటు లేకుండా ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను స్థానిక అధికారులను ఆదేశించారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం 2 కోట్ల 25 లక్షల నిధులతో ఏర్పాట్లను చేస్తోంది. ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసింది, కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంతో పాటు యాత్రికులు రద్దీ ఉండే ప్రాంతంలో చలువ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం కళ్యాణం చూసే సమయంలో భక్తులకు ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా కళ్యాణం వీక్షించేందుకు సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఆలయం మొత్తానికి అందమైన రంగులను తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణాల్లో విద్యుత్ దీపాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా నేరుగా కళ్యాణం టికెట్లను దేవస్థానం అందుబాటులో ఉంచి భక్తులకు విక్రయిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి కదిలి వచ్చే భక్తుల కోసం 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. శ్రీరామనవమి ముందు నాలుగు రోజుల నుంచి సుమారు రెండు లక్షల లడ్డూలను తయారు చేసి సిద్ధంగా ఉంచుతామని దేవస్థానం తెలిపారు.
స్వామివారి ప్రసాదం తలంబ్రాలు కోసం భక్తులు ఇబ్బంది పడకుండా భక్తుల సౌకర్యార్థం 80 కౌంటర్ల ద్వారా తలంబ్రాలు పంపిణీ చేస్తామని లడ్డు ప్రసాదం పంపిణీ కూడా ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. అయితే ఈనెల 30 న ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో ఉగాది రోజు ఆలయ అర్చకులకు వేద పండితులకు దీక్ష వస్త్రాలను అందించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాలలో ఒక్కో రోజు ఒక్కో ఉత్సవం నిర్వహిస్తూ ఈనెల 30 నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభమవుతాయి.
ఏప్రిల్ 5 సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 6న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సీతారాముల కళ్యాణం. ఏప్రిల్ 7 న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు అందించనున్నారు. భద్రాద్రిలో ప్రధానంగా జరిగే ఈ ఉత్సవాలను భక్తులు మెచ్చుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటులు చురుగ్గా సాగుతున్నాయి.