27-02-2025 01:24:22 AM
సంగారెడ్డి, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ , నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిన తీరును పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. శాసన మండలి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల పోలింగ్ కోసం సంగారెడ్డి జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.
శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గానికి సంబంధించి జిల్లాలో 25652 మంది ఓటర్లు ఉండగా, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 2690 మంది ఉన్నారని వివరించారు. పట్టభద్రుల నియోజకవర్గానికి 40 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ సెగ్మెంట్ కు 28 పోలింగ్ కేంద్రాలను కలుపుకుని జిల్లాలో మొత్తం 68 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. 4 రెవిన్యూ డివిజన్లు , 28 రెవెన్యూ మండలాలతో పాటు మున్సిపల్ పట్టణాలలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
ఓటర్ల సౌలభ్యం కోసం ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు దాదాపు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీ.ఓ, ఒక ఏ.పీ.ఓ, ఇద్దరు ఓ.పీ.ఓల చొప్పున నలుగురు అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. 68 పోలింగ్ కేంద్రాలకు సరిపడా పోలింగ్ సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20 శాతం అదనపు సిబ్బందిని కూడా రిజర్వ్ లో ఉంచామని, వీరికి పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లచే రెండు దఫాలుగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
జహీరాబాద్ , సంగారెడ్డి , అందోల్ , నారాయణఖేడ్ డివిజన్ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది అక్కడి నుండి బ్యాలెట్ బాక్సులు, సామాగ్రిని తీసుకుని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం, ఇతర అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు చేర్చడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.
గురువారం ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, స్వేచ్చాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సామాగ్రిని సంగారెడ్డి ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, ఆందోల్ ఆర్డీవో పాండు, జహీరాబాద్ ఆర్డిఓ రాంరెడ్డి, నారాయణఖేడ్ ఆర్డీవో మనోహర్ చక్రవర్తిలో పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్లు పాల్గొన్నారు