26-02-2025 06:08:58 PM
ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలి..
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. 27న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుండి బ్యాలెట్ బాక్స్ లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ అధికారులు కేంద్రాలకు పెళ్లి ఎందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వెళ్లే వాహనాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలిసి జండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎం. ఎల్. సి. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
జిల్లాలో పట్టబద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్లలో మొత్తం 6607 మంది ఓటర్లు ఉండగా ఇందులో 6 వేల 137 మంది పట్టబద్రులు, 470 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు 19 మంది ప్రిసైడింగ్ అధికారులు, 87 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సమర్థవంతంగా జరిగేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, పోలింగ్ ఏజెంట్లు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ లోకేశ్వరరావు, డిఆర్డిఓ దత్తారావు, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.