20-03-2025 08:53:00 PM
రేపటి నుండి ప్రారంభం కానున్న పరీక్షలు..
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఎస్ఎస్సి పరీక్షలకు పట్టణంలో, మండలంలో విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలో తవక్కల్ పాఠశాల, సింగరేణి ఉన్నత పాఠశాల, కార్మెల్ ఉన్నత పాఠశాల, తవక్కల్ పాఠశాల రామకృష్ణాపూర్, బిఎల్ ఆల్ఫోన్సా కాన్వెంట్ స్కూల్ రామకృష్ణాపూర్ లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 913 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉదయం 9:30 కి ప్రారంభమై 12:30 వరకు పరీక్షలు ముగియ నున్నాయి. పది పరీక్షలకు నిమిషం నిబంధన లేక పొగా విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యం వరకు పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని విద్యాధికారులు తెలిపారు. అయినప్పటికీ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందు చేరుకోవాలని సూచించారు. కాగా మండల వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఐదు పరీక్ష కేంద్రాలలో 45 మంది ఇన్విజిలెటర్లు, చీఫ్ సూపరెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులుగా విధులు నిర్వహించనున్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు చేపట్టనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా చూడడంతో పాటు, జిరాక్స్ సెంటర్లను ముందస్తుగా మూసివేయాలని అధికారులు సూచించారు.
విద్యార్థులు ఇవీ గుర్తుంచుకోండి...
1. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలి.
2. పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.
3. హాల్ టికెట్ ను వెంట తెచ్చుకోవాలి.
4. పరీక్ష పూర్తయ్య వరకు కేంద్రం విడిచి బయటకు వెళ్ళరాదు.
5. పరీక్ష రాయడం పూర్తయిన తర్వాత రాసిన సమాధానాలను ఒకటికి రెండుసార్లు చూసుకోవడం మంచిది.