కలెక్టర్ జితేష్ వి పాటేల్...
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరగనున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి సర్వం సిద్ధమైనట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jithesh V.Patil) తెలిపారు. 9 నుండి 11వ తేదీ వరకు రివర్ ఫెస్టివల్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. భద్రాచలానికి విచ్చేసే భక్తులకు దైవ దర్శనంతో పాటు బోటింగ్, గిరిజన సంప్రదాయాలు, వంటకాలు, బెండలంపాడు ట్రెక్కింగ్ కనువిందు చేస్తాయనీ ఆయన తెలిపారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా 9వ తేదీ, 10వ తేదీలో జరగబోవు తెప్పోత్సవం ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఉత్తర ద్వారం వద్ద సెక్టార్ అధికారులకు తెప్పోత్సవం, ద్వార దర్శనం రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులందరూ 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు అన్ని సెక్టార్ల అధికారులు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో ముక్కోటి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆయన తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం వద్ద భక్తులను నియంత్రించేందుకు సెక్టార్లుగా విభజించడం జరిగిందని తెలిపారు. పదవ తారీకు ఉదయం ఐదు గంటలకు స్వామివారి ఉత్తర ద్వార ద్వార ఉంటుందన్నారు. భద్రాచలం విచ్చేసే భక్తులు భద్రాచల రాముని దర్శించడంతో పాటు మంచి అనుభూతిని కలిగేలా ఏరు పండగను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఏరు అనగా కోయ, తెలుగు భాషలలో నది అని అర్థం వస్తుందని గోదావరి, తాళి పేరు, కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో సాంప్రదాయాలు కలిసిన ప్రత్యేకమైన సంస్కృతి మన జిల్లాలో ఉందని ఆయన అన్నారు. గిరిజన సాంస్కృతి, స్థానిక సాంప్రదాయాలు, ఉత్పత్తులను అందరికీ తెలియపరచడమే ఏరు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. దీనిలో భాగంగా గోదావరి ఘాటు వద్ద 9వ తారీకు నుండి 11వ తారీకు వరకు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, గిరిజన కళాకారులు, స్థానిక, గిరిజన నృత్య ప్రదర్శనలు అందరూ వీక్షించేలా గోదావరి ఘాట్ వద్ద స్టేజిను రూపొందించడం జరిగిందన్నారు. అదేవిధంగా కరకట్ట వద్ద 50 స్టాళ్లను ఏర్పాటు చేసి ఆర్గానిక్ నెయ్యి అటవీ ఉత్పత్తులు గిరిజన ఉత్పత్తులు విక్రయించడం జరుగుతుందన్నారు.
గోదావరి ఘాట్ వద్ద బోటింగ్ పాయింట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సామాన్యుల సైతం గోదావరిలో బోటింగ్ అనుభూతిని పొందేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గోదావరి నది ఒడ్డు పైన ఏర్పాటుచేసిన గుడారాలలో రాత్రి బస పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. ఐటీడీఏ గిరిజన మ్యూజియం ఏర్పాటుకు ఐటీడీయో పిఓ ఎంతగానో కృషి చేశారన్నారు. భద్రాచలం కి వచ్చిన భక్తులు, పర్యాటకులు రాత్రి బస చేసి మరుసటి రోజు మ్యూజియం, బోజ్జికుప్ప బెండలంపాడు ట్రాకింగ్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి దీవులను చూడాలనుకున్న వారు మన కిన్నెరసానిలో పర్యటించాల్సిందిగా కోరారు. ఈ ఏర్పాట్లు అన్నింటిని మహిళా సమాఖ్య ద్వారా సభ్యులు ఏర్పాటు చేయడం జరిగిందని మహిళా సమాఖ్య అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఈ రివర్ ఫెస్టివల్ లో పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నామని, మార్చ్ వరకు ఈ రివర్ ఫెస్టివల్ ను కొనసాగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఉత్తర ద్వారదర్శనానికి విచ్చేసే భక్తులు ద్వార దర్శనం అనంతరం భారీకేట్లు దాటవద్దని ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.