27-02-2025 01:30:51 AM
జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 2664 మంది ఉపాధ్యాయులు
సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 26: నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఎన్నికలో పాల్గొనే జిల్లా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలలో 2664 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కోనున్నారని, నేటి ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు పీ.ఓ, ఏపీ.ఓ, ఇద్దరు ఓపీఓలతో పాటు అదనపు సిబ్బందిని నియమించామని కలెక్టర్ తెలిపారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ తేజస్ సూచించారు.