calender_icon.png 1 November, 2024 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్కొండ బోనాలకు అంతా సిద్ధం

06-07-2024 12:00:00 AM

  1. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పన
  2. ఏర్పాట్లను పరిశీలించిన హైదరాబాద్ కలెక్టర్, సీపీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): ఆషాఢ మాసం సందర్భంగా గోల్కొండలో జరిగే  చారిత్రక బోనాలు రేపటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోల్కొండ కోటలో తొలి పూజ ప్రారంభమవుతున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా పీస్ కమిటీ సహకరించాలని కోరారు.  గోల్కోండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బాపూనగర్ మందిర్ బస్తీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ప్రతి నెల షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పటిష్ట బందోబస్తు.. 

బోనాలకు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సీపీ తెలిపారు. కలెక్టర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేబుదొంగలు, చైన్ స్నాచర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. దొంగలపై ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఈవ్‌టీజింగ్ జరగకుండా షీటీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు సూచించిన ప్రదేశంలోనే ఆర్టీసీ బస్సులను పార్కింగ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ విశ్వప్రసాద్, సౌత్‌జోన్ డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీమహమ్మద్ అశ్వాక్, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, ఆర్డీవో మహిపాల్, వివిధ శాఖల అధికారులు, పీస్ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.