calender_icon.png 20 February, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పటికల్లా అంతా సిద్ధం

29-01-2025 11:41:38 PM

స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వహణపై పీసీబీ నివేదిక...

కరాచీ: వచ్చే నెల 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే టోర్నీ నిర్వహణ సమయం దగ్గరపడుతున్నప్పటికీ మ్యాచ్‌లు జరగాల్సిన స్టేడియాలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని వివరణ కోరింది. పాక్‌కు చెందిన ఒక పేపర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పీసీబీ మాట్లాడుతూ..  ‘స్టేడియాల్లో రెనొవేషన్ వర్క్ జరుగుతున్న మాట వాస్తవమే. అయితే డెడ్‌లైన్‌లోగా పనులన్నీ పూర్తి చేసి మ్యాచ్‌లు నిర్వహిస్తాం. ఒకవేళ టోర్నీ సజావుగా జరిగితే మేము హీరోలు లేదంటే జీరోలని ఒప్పుకుంటాం’ అని తెలిపింది.

ఇప్పటికే మ్యాచ్‌లు జరగనున్న రావల్పిండి, కరాచీ, లాహోర్ స్టేడియాలను పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జనవరి 31 వరకు ఉన్న డెడ్‌లైన్ లోపే పనులన్నీ పూర్తి చేయనున్నట్లు పీసీబీ పేర్కొంది. అయితే చాంపియన్స్ ట్రోఫీకి ముందే న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు వన్డే ట్రై సిరీస్ జరగనుంది. ఇందులో తొలి రెండు గేములు లాహోర్‌లో, తర్వాతి రెండు మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కరాచీ వేదికగా జరగనున్నాయి. కాగా చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో మ్యాచ్‌లు జరగనున్న మూడు స్టేడియాలకు కలిపి రెనోవెషన్ కింద పీసీబీ పీకేఆర్ 12 బిలియన్ కేటాయించింది. ఇప్పటికే టికెట్లకు సంబంధించిన అమ్మకాలను మొదలుపెట్టింది. ఇక భద్రతా కారణాల రిత్యా పాక్‌లో ఆడేందుకు టీమిండియా నిరాకరించడంతో భారత్ ఆడే మ్యాచ్‌లన్నింటిని యూఏఈ వేదికగా జరగనున్నాయి.