07-04-2025 12:00:00 AM
ఆదిలాబాద్/కుమ్రం భీం అసిఫాబాద్ ఏప్రిల్ 6 (విజయక్రాంతి)/బెల్లంపల్లి: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు రామాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ దంపతులు తన కాలనీ శాంతి నగర్ లోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నేడు ప్రపంచ దేశాలు సైతం హిందూ ధర్మం, సంప్రదాయాల వైపు చూస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.
మరోవైపు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తాంసి మండలం తో పాటు నేరెడిగొండ మండలాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగు రామన్న సైతం శ్రీరామ నవమి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామల్లోని రామాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అటు కిసాన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి సైతం పలు రామాలయాలను దర్శించుకుని సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
బుగ్గలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మండల సీనియర్ కాంగ్రెస్ కారుకూరి రామ్ చందర్ పాల్గొన్నారు. బెల్లంపల్లి బస్తీలోని శ్రీరామ భజన మందిర్ దేవాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నెన్నెల్ మండలంలోని అభయాంజనేయ స్వామి దేవస్థానం నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు చేశారు.
ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ శ్రీ కోదండరామాలయం ఆవరణలోనీ కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక కమనీయంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ దండే విఠల్, దహిగా మండల కేంద్రంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కేంద్రంలో కోదండ రామాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొన్నారు.