calender_icon.png 29 April, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా అక్కసే!

29-04-2025 12:28:10 AM

  1. ఖజానా ఖాళీచేసి మాపై కేసీఆర్ నిందలా? 
  2. కేసీఆర్, మోదీ అవసరానికి తగ్గట్టు మాటమారుస్తారు
  3. రాహుల్‌కు, నాకు ఏ గ్యాప్ లేదు 
  4. మావోయిస్టులతో చర్చల కోసం శాంతికమిటీ 
  5. ఆపరేషన్ కగార్‌పై పార్టీ నిర్ణయం తర్వాతే ప్రభుత్వ విధానం 
  6. సీనియర్ నేతలు జానారెడ్డి, కేకేతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ 

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ‘ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రసంగంలో పస లేదు..స్పష్టత లేదు.. కేవలం అక్కసును మాత్రమే వెళ్లగక్కారు.. కేసీఆర్ ఎన్ని చెప్పినా బీఆర్‌ఎస్‌ను ప్రజ లు నమ్మే స్థితిలో లేరు..’అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు పిల్లగాళ్లు అయితే..మరి వాళ్లనెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు..? అని కేసీఆర్‌ను సీఎం ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్ తమపై నింద లు వేయడమేంటని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్‌పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని తెలిపారు. మావోయిస్టుల అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. ఆపరేషన్ కగార్‌పై ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనే అంశంపై కాంగ్రె స్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో సోమవారం హైదరాబాద్‌లోని జానారెడ్డి నివాసంలో సీఎం చర్చించారు.

మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజా సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని ఆదివారం కలిసి కోరిన నేపథ్యంలో.. సోమవారం జానారెడ్డి, కేకేతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్ చాట్ నిర్వహిం చారు.

మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కేశవరావు పార్టీలో చర్చిస్తారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపింది జానారెడ్డి, కేకే అని, ఇప్పుడు కూడా ఆ వ్యవహారం ఆ ఇద్దరే చూస్తారని తెలిపారు. 

రాహుల్‌గాంధీ సభకు బస్సులు ఇచ్చారా? 

గతంలో రాహుల్‌గాంధీ సభకు బస్సులు ఇవ్వని చరిత్ర బీఆర్‌ఎస్ వాళ్లదని, కానీ వారి సభకు ఆర్టీసీ బస్సులు కావాలని అడిగిన వెంట నే.. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వాలని చెప్పినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సులను ఇవ్వడం వల్ల సంస్థకు ఆదాయం వ స్తుంటే  వద్దంటామా..? అన్నారు. కేసీఆర్,మోదీ తమ అవసరాలకు అనుగుణంగా మాటలు మారుస్తున్నారని విమర్శించారు.

రాహు ల్‌గాంధీకి, తనకు గ్యాప్ ఉందన్న చర్చలో వాస్తవం లేదని, అయితే తమ సంబంధాన్ని బయటి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదని, ఎవరినో నమ్మించాల్సిన పనిలేదన్నారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలన్నారు. రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరమ్మదేనని అన్నారు. 

మరో ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటా.. 

 కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా హైదరాబాద్‌లోనే టైమ్‌పాస్ చేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని, అవసరమైతేనే హైదరాబాద్‌కు రావాలన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభు త్వ పథకాలు వివరించాలని సీఎం సూచించారు. ఎమ్మె ల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదన్నారు.

పార్టీలో ఓపిగ్గా ఉంటేనే పదవులు వస్తాయని, తొందరపడి ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారని సీఎం హెచ్చరించారు. మరో ఐరవై ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు. పదవుల విషయంలో తాను మాటిస్తే చేసి తీరుతానని, ఇచ్చిన హామీ మేరకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు చెప్పారు.

ప్రభుత్వ అధికారుల విషయంలో ఆచితూచి వ్యవహారించాల్సిన అవసరం ఉంటుందన్నారు. అయితే అధికారుల్లో తమవారు..వేరేవాళ్లు అంటూ ఉండరన్నారు. సమర్థత ఉన్న అధికారులను గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ కొనసాగించకతప్పదని తెలిపారు. కొందరు అధికారు లు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు.

ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగదని, కేటీఆర్ కేసు అయినా, ఫోన్‌ట్యాపింగ్ కేసు అయినా అరెస్టుల విషయంలో తొందరపడమని, చట్టం ప్రకారమే నడుచుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్‌లైన్ చేశామని, కానీ ఆప్షన్ లేకనే కొంత మంది అధికారులను కొనసాగిస్తున్నామని, ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ ఎలా తెలుస్తాయన్నారు. 

కేసీఆర్ హయాంలో పథకాలు లాంచింగ్.. క్లోజింగే  

‘పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలను తీసుకొచ్చాం.. ఇప్పుడు వాటన్నింటిని స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం.. ప్రభుత్వ పరంగా ప్రజలకు చేసిన పనులను చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డాం..అవి మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్‌రెడ్డి చెప్పింది చేస్తాడని ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తాం. కేసీఆర్ మాదిరిగా లాంచింగ్..క్లోజింగ్ పనులు చేయం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. ఎన్నికలకు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుంది..’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

జానారెడ్డి, కేకేకు ‘ఆపరేషన్ కగార్’ బాధ్యతలు

మావోయిస్టులకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’పై తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చలు ప్రారంభించింది. మావోయిస్టు సమస్య ను శాంతిభద్రతల సమస్యగానే కాకుండా.. సామాజిక కోణంలో చూడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే వెల్లడించారు.

అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం, ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉండటంతో కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా సోమవారం పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, కే కేశవరావుతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో పార్టీ అధిష్ఠానంతో కూడా చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, కేశవరావు మాట్లాడినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా, హోంమంత్రిగా జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా కే కేశవరావు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా దిగ్విజయ్‌సింగ్ ఉన్నారు. ఆ సమయంలో అప్పటి సీఎం వైఎస్ సూచనల మేరకు నక్సల్స్‌తో జరిగిన శాంతిచర్చల్లో జానారెడ్డి, కేకే కీలకంగా వ్యవహరించారు.

వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు సమస్యలపై అంశం పై జానారెడ్డి, కేకేకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని శాంతిచర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్లు హరగోపాల్, అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ తదితరులు కలిసి కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఎల్కతుర్తి సభలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలన్నారు.