calender_icon.png 25 October, 2024 | 7:55 AM

అంతా కేసీఆర్ ఆలోచనే

25-10-2024 02:13:47 AM

  1. సమీక్షకు పిలిచే వరకు కాళేశ్వరం గురించి ఏమీ తెలియదు
  2. సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాత మార్పులు జరిగాయి
  3. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు
  4. నిరాధార ఆరోపణలు చేయవద్దన్న కమిషన్ 
  5. డీపీఆర్‌పై ప్రశ్నించిన కమిషన్

* పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదనపు టీఎంసీ పనులు చేపట్టాం. ప్రభుత్వాధినేతల ఆదేశాల మేరకే మేడిగడ్డలో 

నీరు నిల్వ చేశాం.  

 ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు గురువారం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. చెప్పే ప్రతి సమాధానానికి డాక్యుమెంట్ సహిత ఆధారాలుండాలని, నిరాధారంగా చెప్పవద్దని కమిషన్ స్పష్టం చేసింది.

వెంకటేశ్వర్లు తీరుపై కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొంది. కమిషన్ ముందు నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. గతంలో కమిషన్ విచారణకు హాజరైన వెంకటేశ్వర్లును గురువారం మరోసారి క్రాస్ ఎగ్జామిన్ చేసింది.

కాళేశ్వరం డీపీఆర్ నిర్ణయం ఎప్పుడు, ఎవరు తీసుకు న్నారు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తర్వాతే డీపీఆర్ మార్పులు జరిగాయా అని కమిషన్ ప్రశ్నించింది. 2016లో అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే నిర్ణయం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన అంతా కేసీఆర్‌దేనని వెంకటేశ్వర్లు తెలిపారు.

అప్పటి సీఎం సమీక్షకు పిలిచే వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. సీడబ్ల్యూసీ అప్రూవల్ తర్వాత డీపీఆర్‌లో మార్పులు జరిగాయా అన్న కమిషన్ ప్రశ్నకు సైట్ కండిషన్ ఆధారంగా డీపీఆర్‌లో మార్పులు జరిగాయని బదులిచ్చారు. 

ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాల మేరకే..

డీపీఆర్‌లో మార్పులు ఎవరు చేశారని ప్రశ్నించగా ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాల మేరకు డీపీఆర్‌లో మార్పులు జరిగాయని నల్లా వెంకటేశ్వర్లు వివరించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల లొకేషన్స్ ఎవరు ఫైనల్ చేశారన్న కమిషన్ ప్రశ్నకు.. వ్యాప్కోస్ సంస్థ సూచించిం దని చెప్పారు. ప్రభుత్వం, అధికారుల ప్రమేయం లేకుండానే వ్యాప్కోస్ ఎలా సూచిస్తుందని కమిషన్ ప్రశ్నించింది.

అప్పటి ప్రభుత్వం, అధికారుల సూచన మేరకే తాము ముందుకు వెళ్లినట్లు తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల పనుల కోసం ఖర్చు చేసిన రూ.16వేల కోట్లు వృథా చేయడం ఏ మేరకు సబబని కమిషన్ ప్రశ్నించగా.. అది అప్పటి ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయంగా వెంకటేశ్వర్లు తెలిపారు.

అదనంగా కేవలం రెండు లక్షల ఎకరాల ఆయకట్టు కోసం ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తారా అని కమిషన్ ఆయనను ప్రశ్నించింది. తమ్మిడిహట్టి నుంచి తక్కువ విద్యుత్, రెండు లిఫ్టులతోనే నీరు వచ్చేది కదా అన్న కమిషన్.. మూడు లిఫ్టులు, భారీ మొత్తంలో విద్యుత్ ఉపయోగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, దీంతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నదని వెంకటేశ్వర్లు తెలిపారు. 2 లక్షల అదనపు ఆయకట్టుతో పాటు 18 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ కూడా ఉందన్నారు. రిటైర్డ్ ఇంజినీర్ల సలహాలను ఎందుకు తీసుకోలేదని, ఉద్దేశపూర్వకంగా చేశారా అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదన్నారు. 

డీపీఆర్‌కు అంత సమయం ఎందుకు పట్టింది..

డీపీఆర్ సమర్పించేందుకు ఆరేళ్ల సమయం ఎందుకు పట్టిందని, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు ఎందుకు చేపట్టారని కమిషన్.. వెంకటేశ్వర్లును ప్రశ్నించగా, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదనపు టీఎంసీ పనులు చేపట్టినట్లు సమాధానమిచ్చారు.

ఎవరి ఆదేశాల మేరకు మేడిగడ్డలో నీటిని నిల్వ చేశారన్న ప్రశ్నకు ప్రభుత్వాధినేతల ఆదేశాల మేరకు అని సమాధానమిచ్చారు. కాగా గత నెల 28న సైతం నల్లా వెంకటేశ్వర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. అప్పట్లో కూడా కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని ఆయనను హెచ్చరించింది. అప్పట్లోనూ అనేక ప్రశ్నలను కమిషన్ గుప్పించింది.