calender_icon.png 29 December, 2024 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలో అన్నింటికీ కొరతే

04-07-2024 02:11:06 AM

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో రాష్ర్టంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తోందని, నిధుల కొరతతో గ్రామపంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో గ్రామీణ వ్యవస్థ, గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అన్నారు. స్థానిక సంస్థల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగక గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మీడియా సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో వసూలు చేసిన ఇంటి పన్నుల మొత్తాన్ని ట్రెజరీలో జమచేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం గ్రామపంచాయతీలను డబ్బులు డ్రా చేసుకోనీయకుండా ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.

ఏడు నెలల నుంచి పంచాయతీ కార్మికులకు సరిగ్గా జీతాలు చెల్లించడం లేదని, గ్రామాల్లో కార్మికులకు జీతాలు రావడం లేదన్నారు. పంచాయతీ ట్రాక్టర్ల డీజిల్‌కు కూడా డబ్బులు కరువయ్యాయని, వీధి దీపాలు వెలగట్లేదని.. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆరోపించారు. గ్రామ పాలన అస్తవ్యస్తం అయిందని, గ్రామ పంచాయతీల కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 498 కోట్లను కూడా గత ప్రభుత్వం వాడుకుందని అన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించడానికి తప్పితే.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదని విమర్శించారు.