calender_icon.png 24 October, 2024 | 9:58 PM

అందరికీ డార్లింగ్ అవుతుంది

06-07-2024 09:56:28 PM

కథకి అగ్రతాంబూలం ఇస్తూ అనతికాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా అవతరించింది ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్. ‘హనుమాన్’ వంటి భారీ విజయం తర్వాత ఆ సంస్థ నుండి వస్తున్న ‘డార్లింగ్’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ప్రస్తుత జీవన శైలిలోని మార్పులు జీవితానికి మాధుర్యాన్ని అందించే ప్రేమ, దాంపత్యం వంటి వ్యవహారాలలో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి అశ్విన్ రామ్ దర్శకుడు. ప్రేమ వివాహం ద్వారానే దాంపత్య జీవనం సాగిస్తున్న తాము ఈ కథ విన్న వెంటనే సినిమాగా ప్రేక్షకులకు అందించాలని నిశ్చయించుకున్నాం అంటూ “డార్లింగ్‌” చిత్ర విశేషాలను పంచుకున్నారు చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రీమతి చైతన్య. నభా నటేష్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా సంగతులు ఆమె మాటల్లోనే..

గత కొన్నేళ్ళలో యాక్షన్ సినిమాలు, వీఎఫ్‌ఎక్స్‌కి ప్రాధాన్యత గల భారీ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకులు తెరపై తమని తాము చూసుకునే చిత్రాలు తగ్గిపోతున్నాయి. ‘డార్లింగ్’ సినిమాతో మరోసారి అలాంటి అనుభూతిని అందించనున్నాం. ప్రేమ, పెళ్ళి విషయంలో అభిప్రాయాలు మారిపోతున్నాయి. పెళ్ళయిన తర్వాత కొంత కాలానికి జీవితం ఒకే రీతిన సాగుతున్నట్టు అనిపించడం ఇందుకు ఓ కారణం. ఇలాంటి ఓ అంశాన్ని నేటి తరం వారికి చేరువయ్యేలా సరదాగా చూపించాం. యువతతో పాటు వారి కుటుంబాలకీ ఈ సినిమా నచ్చుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా అందరికీ ‘డార్లింగ్’ అవుతుంది. మాది కూడా ప్రేమ వివాహమే. ఆ కారణంగానే దర్శకుడు చెప్పిన ఈ కథకి మేం బాగా కనెక్ట్ అయ్యాం. ‘హనుమాన్’ విడుదలకు ముందే ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. 

ముందుగా ఈ సినిమాకి ‘వై దిస్ కొలవరి’ అనే టైటిల్ అనుకున్నాం. అయితే ‘హనుమాన్’తో మాకు టైటిల్ ప్రాముఖ్యత తెలిసొచ్చింది. ముందు అనుకున్నదే ఖాయం చేసుంటే అది యూత్‌కి మాత్రమే చేరువయ్యేదేమో. తర్వాత కొన్ని టైటిల్స్ అనుకుంటూ చివరికి ‘డార్లింగ్’ అని ఫిక్స్ చేశాక, దానికి ‘వై దిస్ కొలవరి’ని ట్యాగ్‌లైన్‌గా పెట్టాం. కథని ప్రేక్షకులకు చేరవేసేవి హీరో హీరోయిన్ పాత్రలు. వాటికి తగ్గట్టే రెండు విభిన్న నేపథ్యాలకు చెందిన పాత్రలకు నభా, ప్రియదర్శి లను ఎంపిక చేయడం జరిగింది. 

నభా ప్రమాదం బారిన పడి కోలుకున్నాక తిరిగి సినిమాల్లోకి రావాలనుకున్నపుడు మేం కలవడం జరిగింది. ఈ సినిమాకి తనే బలం. ఆమె పాత్ర మహిళలపై గౌరవాన్ని పెంచేలా వుంటుంది. ‘హనుమాన్’లా ఈ సినిమాని అనువాదంగా కాకుండా రీమేక్ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అది సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది.

సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఒక భాగం అయిపోయింది. అమెరికాలో ఉన్నపుడు రోజులో మూడు నాలుగు గంటలు ఏదోటి చూస్తూనే ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అదే చిత్ర పరిశ్రమలో పని చేస్తుండడం ఆనందంగా వుంది. కళాత్మకమైన సినిమాతో పాటు మరో వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నా.  నా చదువు కూడా వ్యాపార రంగానికి సంబంధించినదే. రెండు రంగాల్లోనూ రాణిస్తుండటం ఆనందదాయకం. ఇదంతా దేవుడి ఆశీర్వాదం, భర్త నిరంజన్ రెడ్డితో పాటు కుటుంబమంతా అందించే సహకారం వలనే. నిరంజన్ గారిలో సృజనాత్మక కోణం బాగుంటుంది. కథల ఎంపిక మొదలుకొని, నటీనటులు తదితర విషయాలు ఆయన చూసుకుంటే.. వ్యాపార వ్యవహారాలు నేను చూస్తాను.

‘హనుమాన్’ ప్రేక్షకులు అందించిన గొప్ప విజయం. అయితే అందరూ అనుకుంటున్నట్టు సంక్రాంతికి ‘జై హనుమాన్’ విడుదల ఉండదు. పూర్వ నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. ‘హనుమాన్’ విజయానికి తగ్గట్టే ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఆ దిశగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తారనేది హనుమంతుల వారే నిర్ణయిస్తారని నమ్ముతున్నాం. రామ్ చరణ్, చిరంజీవి అయితే బాగుండని నా వ్యక్తిగత అభిప్రాయం. ‘-హనుమాన్’ సినిమా విషయంలో చిరంజీవి గారి సహకారం మర్చిపోలేనిది. ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాం. అది కాకుండా ఇంకో పది సినిమాలు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి. రానున్న మూడేళ్ళలో అవి విడుదలవుతాయి.