హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఈ నెల 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. ఇదే వేదికపై ‘సరిమప..’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. అనంతరం చిత్ర కథానాయకుడు నాని మాట్లాడుతూ.. “నిర్మాత దానయ్యకు అదృష్టం వెన్నంటి ఉంది. అందుకే ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’ లాంటి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి.
ఎగ్జిబిటర్లు, పంపిణీదారులకు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన సినిమా ‘సరిపోదా శనివారం’. ఆగస్టు 29న పోతారు.. అందరూ పోతారు.. అందరూ థియేటర్లకు పోతారు.. ‘సరిపోదా శనివారం’ చూస్తారు” అన్నారు. ‘నాని నిజంగానే ట్రెజర్ హంటర్ అని చెప్పాలి..’ అని కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ తెలిపింది. చిత్ర దర్శకుడు వివేక్ మాట్లాడుతూ.. ‘అంటే సుందరానికి’ తర్వాత ఏ తరహా సినిమా చేయాలో అర్థం కాలేదు.
నాని నాకు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ చెబితే సరిపోదని ఆయనకు ఈ సినిమా ఇచ్చా. “సరిపోదా శనివారం’ బ్లాక్ బస్టర్ అవుతుంది. నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. ఆయన ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవాలి. వివేక్ పెద్ద దర్శకుల కోవలో చేరతారు” అని నిర్మాత దానయ్య అన్నారు. ఈ వేడుకలో దేవ కట్టా, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, శైలేశ్ కొలను, ప్రశాంత్ వర్మతోపాటు చిత్రబృందం పాల్గొన్నారు.