01-04-2025 02:36:20 AM
మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన తాజాచిత్రం ‘ఎల్2: ఎంపురాన్’. 2002లో గుజరా త్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. అల్లర్ల సమ యంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారణంగా హత్య చేయ డం.. కొంత కాలానికి ఆయనే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలతో సాగిన ఈ సన్నివేశాలను పలువురు తప్పుపట్టారు. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపించారు.
ఈ సినిమాను నిలిపివేయా లని డిమాండ్ చేశారు. ఈ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే నిర్మాత గోకులం గోపాలన్, కథానాయకుడు మోహన్‌లాల్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూసి, చిత్రబృందానికి మద్దతు ఇచ్చారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవాలన్నారు. ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ తల్లి మల్లిక ఈ వివాదంపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్టును పెట్టారు. “ఎల్2:ఎంపురాన్’ తెర వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసు.
పృథ్వీరాజ్‌ను అన్యాయంగా నిందిస్తున్నారు. మోహన్‌లాల్ గానీ, చిత్ర నిర్మాతలు గానీ ఎవరూ కూడా పృథ్వీరాజ్ తమను మోసం చేశాడని చెప్పలేదు. ఇప్పుడు వాళ్లకు తెలియకుండా కొందరు నా కొడుకుని బలిపశువును చేయాలని చూస్తున్నారు.
సినిమాలో సమస్యలుంటే అందులో భాగమైన వాళ్లంతా బాధ్యులే కదా! కానీ, పృథ్వీరాజ్ ఒక్కడే జవాబుదారీ ఎలా అవుతాడు?” అని తన పోస్టులో ఆవేదన వెల్లగక్కారు మల్లిక. ఇదిలా ఉండగా, మార్చి 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.వంద కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే, విమర్శల నేపథ్యంలో సినిమాలో మొత్తం 17 సన్నివేశాల్లో మార్పులు చేసినట్టు వార్తలొస్తున్నాయి.