calender_icon.png 6 April, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి

05-04-2025 07:30:46 PM

భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో ఎస్సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన డా. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొని, డా. బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. చిట్ట చివరి పేద కుటుంబం వరకు సంక్షేమ పథకాలు చేరేవిధంగా అధికారులు పని చేసినప్పుడే మహనీయుల ఆశయాలను సాధించిన వారమవుతామని తెలిపారు.

విద్యనభ్యసించడం వల్ల ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పు వస్తుందనడానికి డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం నిదర్శనమని అన్నారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం, కలకత్తా విశ్వ విద్యాలయంలో జగ్జీవన్ రామ్ విద్యనభ్యసించారని, 1936 సంవత్సరం నుండి 1986 వరకు దాదాపు 50 సంవత్సరాలు సీనియర్ పార్లమెంటేరియన్ గా పనిచేసిన ఏకైక వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. 1946లో జగ్జీవన్ రామ్ నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో ప్రజల మన్ననలు పొందారని అన్నారు. భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ లో కార్మికమంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడుగా సామాజిక న్యాయాన్ని రాజ్యాంగంలో పొందుపరచబడిందని అన్నారు.

45 సంవత్సరాలకు పైగా వివిధ శాఖల కేంద్ర మంత్రిగా పనిచేశారని, ముఖ్యంగా జగ్జివన్ రామ్ 1971 ఇండో-పాక్ యుద్దం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నారని తెలిపారు. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన రెండు పదవీ కాలాల్లో 1974 కరువు సమయంలో, ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలపడం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయమని అన్నారు. నేటితరం యువతకు డా బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శమని యువత ఆయన బాటలో పయనించి మన జిల్లాకు, రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

 జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్  సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. ఆయన ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆచరణలో సామాజిక స్పూర్తిని నాటిన మహానాయకుడిగా గుర్తు చేశారు. ఆయన సేవలు ప్రతి ఒక్క భారతీయుడికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మి, ఎస్సి అభివృద్ధి అధికారి సునీత, డిఆర్డీఓ నరేష్, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, డీఈఓ రాజేందర్, డిఎస్పీ సంపత్ రావు, వివిధ కులసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.