07-03-2025 12:36:15 AM
మహబూబ్ నగర్, మార్చి 6 (విజయ క్రాంతి) : ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరిలో స్పందించి గుణం ఉండాలని కేంద్ర అధికారులు ఆర్‌ఎస్ మిశ్రా , లికున్ పాత్రా అన్నారు.
జాతీయ విపత్తుల నివారణ సంస్థతో చేసుకొన్న అవగాహన ఒప్పందం ప్రకారం రాష్ర్ట విపత్తుల నివారణ సంస్థ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో ఎంపిక కాబడిన 300 మంది ఆపద మిత్ర వాలంటీర్లకు 3 దశలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించుటకు కేంద్ర అధికారులు ఆర్‌ఎస్ మిశ్రా , లికున్ పాత్రా, రాష్ర్ట నోడల్ అధికారి శ్రీ గౌతమ్ తో కలసి సంయుక్తంగా జడ్.పి. మీటింగ్ హాల్ నందు శిక్షణ ను పరిశీలించారు.
ఈ శిక్షణలో మాజీ సైనికులు, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్., నెహ్రు యువ కేంద్ర సభ్యులు, అన్ని గ్రామ స్థాయిలో ఉండే స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొనడం పై సంతోషం వ్యక్తం చేశారు. వాలంటీర్లలలో కేంద్ర అధికారులు అవగాహన స్థాయిలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
గ్రామ స్థాయిలో ఆకస్మికంగా జరిగే సహజంగా మానవ చర్యల వల్ల కలిగే విపత్తులకు గోల్డెన్ అవర్ లో స్థానికంగా ఉండే పౌరులు ఏ విధంగా ప్రతిస్పందించాలో ప్రతి ఒక్కరికి ఆపదమిత్ర వాలంటీర్లు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి కిశోర్, తహసిల్దార్ జె. సువర్ణరాజు, జిల్లా శిక్షణ కేంద్ర కోఆర్డినేటర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.