కులంబలం తెలిస్తేనే ప్రభుత్వ ఫలాలు పంచే వీలైతది
కులగణన సర్వేపై అనుమానాలు పెట్టుకోవద్దు
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ (విజయక్రాంతి): ఎవరెంతో వారికంత వాటా దక్కాలనే విధానంతోనే తమ ప్రభుత్వం కులగణన చేపడుతోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎన్యూమరేటర్లతో కలిసి ప్రజల వివరాలు సేకరించారు. ఎవరెంతో వారికంత వాటా దక్కాలని, సమాజంలో ఉన్న అసమానతలు పోగొట్టేందుకే కులగణన చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పారు. కులాల బలం తెలిస్తే ఆయా కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.
ప్రజలు కులగణన సర్వేకు సహకరించేందుకు కులసంఘాల నాయకులు మోటివేషన్ చేయాలన్నారు. అనారోగ్యం కలిగితే డాక్టర్ వద్ద ఒంట్లోని సమస్యలు ఎట్లా చెప్తారో, ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు ఆస్తుల వివరాలు అట్లా చెప్పాలన్నారు. ఎక్స్ రే చూసి డాక్టర్ రోగాలను నయంచేసే మందులు ఎలా ఇస్తాడో, ఆ సర్వే సమాచారంతో ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఈ సర్వేపై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, ఆ సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందన్నారు. రాష్ట్ర గవర్నర్ కూడా కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నట్టు చెప్పారు.