స్వీప్ నోడల్ ఆఫీసర్ శరత్‌చంద్ర
రాజేంద్రనగర్, ఏప్రిల్ 20 : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర అన్నారు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో సెల్ప్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సీఎస్‌కే ప్రెస్టీజ్ కౌంటిలో అసోసియేషన్ వారికి, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కేస్ వర్త్ బై ప్రొవిడెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా అందరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ఎన్నికల్లో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదవుతున్నదని, ఈసారి ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోనూ ఓటింగ్‌శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ మేరకు అందరితో ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీవో రాధారణి, డీఈఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ లక్ష్మణ్, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.