calender_icon.png 6 November, 2024 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ సహకరించాలి

22-04-2024 12:05:00 AM

దెంచనాల శ్రీనివాస్ కవిగా, నటుడుగా, ఆధునిక నాటక 

కళాకారుడిగా కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. 

నలభయ్యేళ్లుగా తెలుగు నాటకాన్ని కొత్త అడుగులు వేయించిన రంగస్థల ప్రేమికుడు. జనపథం నాటక రిపర్టరీ పేరుతో 

కళాసేవ చేస్తున్నారు. ఆధునిక నాటక తీరుతెన్నుల 

గురించి ‘విజయక్రాంతి’కి కొన్ని విషయాలు 

ఆయన మాటల్లోనే..

నాటక సమాజాలు మూతపడటానికి, తగ్గిపోవటానికీ ఆర్థిక 

కారణాలేనా ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా?

భారత దేశంలో తక్కిన రాష్ట్రాల్లో నడిచిన నాటక సమాజాల్లాగా ఇక్కడ సమాజం కోసం లేదా చరిత్రను వర్తమాన కోణంలొ చూపించడం కోసం లేదా సగటు భారతీయుడి జీవన శైలిని, సమస్యలనీ చెప్పడం కోసం లేదా ప్రపంచానికి మనం ఇచ్చిన మహా సంస్కృత నాటకాలని ప్రస్తుత ప్రేక్షకులకు చెప్పడం కోసం... ఇట్లా నేను కొన్ని వందల రకాల వస్తువులని చెప్పగలను. ఇట్లాంటి వాటి దేని కోసమూ తెలుగు నాటక సమాజాలు పని చేయలేదు. నాకు తెలిసి ఇక ముందు చేయబోవు కూడా.  కొన్ని మినహాయింపులు, ఏ.ఆర్. కృష్ణ గారు, వైజాగ్ అబ్బూరి వెంకటేశ్వరరావు గారు,  బళ్లారి రాఘవగారు కానివ్వండి, ధర్మవరపు కృష్ణమాచార్యులు గారు, తెలంగాణలో మంత్రి శ్రీనివాస రావు గారు. ఇప్పుడున్న సమాజాల్లో బషీరు, రామ్మోహన్ హోల్లగుండి, వినయ్ వర్మ,  కోట్ల హనుమంతరావు, ఎమ్మెస్ చౌదరీ, బాషా, వల్లూరి శివప్రసాద్, వెంకట్ గోవాడ, అజయ్ మంకెన, నాయుడు గోపి, పాటిబండ్ల ఆనంద రావు, సెంట్రల్ యూనివర్సిటీ లో రాజీవ్ వలిచెట్టి. ఇంకా కొన్ని సమాజాలు కొత్త నాటకాలు తయారు చేసి ప్రదర్శిస్తున్నాయి. ఏదయినా నాటక సమాజం తను ఎందుకు నాటకం వెయ్యాలి అంటే తాము నివసిస్తున్న సమాజం మీద, ప్రజలు మాట్లాడుతున్న భాష మీదా, వ్యక్తితో వ్యక్తికి, వ్యక్తితో సమాజానికి వున్న ఘర్షణల మీద  నాటకాలు రాసి లేదా వేరే భాష నాటకాలు అడాప్టేషన్ చేసుకొని లేదా మన సాహిత్యాన్ని నాటకాలుగా మలుచుకొని ప్రదర్శించాల్సి వుంటుంది. మీరన్నట్టు ఆర్థిక సమస్యలు ఒక కారణం అయితే, రెండో కారణం నాటకానికి గానీ నాటక కళాకారుడికి గానీ అటు సమాజమూ, ఇటు ప్రభుత్వాలు, మీడియా ఎవ్వరూ గుర్తించకుండా ఒక జతీయ స్థాయిలో రాసి, దర్శకత్వం చేసి, నటించే వాడికన్నా ఒక టీవీ సీరియల్, షార్ట్ ఫిలిం లో వూడ్చే నటుడికి ఎక్కువ గుర్తింపు ఇవ్వడం వల్ల నాటకం ఇప్పటి యువతకి , సహృదయ  ప్రేక్షకుడికి దూరమయ్యింది.

తెలంగాణాలో ఏడాదంతా  కంటిన్యూగా నాటక ప్రదర్శనలు జరిపే అవకాశం ఉందా?

ఎందుకు ఉండదు, కచ్చితంగా  ఉంది. గత నలభయ్యేళ్లుగా జనపదం నాటక రిపర్టరీ తరపున మేము నిరూపిస్తూనే ఉన్నాం కదా. ఒకే సంవత్సరంలో దొంగ సత్తయ్య, ఆదిశక్తి, మట్టి బండి అనే మూడు నాటకాలని ప్రదర్శించాం. మేము సెలవులు మినహాయించి 365 రోజులూ నాటకం మీద పని చేస్తున్నము. స్క్రిప్ట్, ఫండ్స్ మొబిలైజేషన్, ఆర్టిస్ట్ సెలక్షన్, ఆర్టిస్ట్ ట్రైనింగ్, నాటక రిహార్సల్స్, ప్రదర్శనలు పెట్టమని  జిల్లాలు తిరగడం, ప్రదర్శనలు చెయ్యడం.

ఇదే తరహాలో మరికొన్ని సమాజాలు ముందుకు వస్తే మీరన్నట్టు ఏడాదంతా గొప్ప నాటక ప్రదర్శనలు జరుగుతాయి. దొంగసత్తయ్య నాటకం పద్మభూషణ్ హబీబ్ తన్వీర్ రాసిన చరణ్ దాస్ చోర్‌కి కంచికచెర్ల కోటేషు ఇన్సిడెంట్‌ని అడాప్ట్ చేసి  ఇప్పటివరకు 24 ప్రదర్శనలు ఇచ్చాం. మృచ్చకటికం నాటకాన్ని మట్టిబండి పేరుతో 15 ప్రదర్శనలు, గిరీశ్ కర్నాడ్ బలి నాటకాన్ని 24 ప్రదర్శనలు ఇచ్చాం.  మనం సినిమా సాహిత్యం తక్కిన కలలు ఇవ్వలేని రంగస్థల అనుభవం ఇస్తే   ప్రేక్షకులు తప్పకుండా వస్తారు, ఏడాది మొత్తం నాటకాలు ప్రదర్శించవచ్చు.  తప్పనిసరిగా వనరులు కావాలి, సృజనాత్మక దర్శకుడు, నటీ నటులు కావాలి.

తెలంగాణ వచ్చాక ఆ ప్రోత్సాహం ఏమీ లేదా? 

తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రదర్శనలు ఇచ్చాము ఇప్పుడు ఇస్తున్నాము. కాకుంటే నేను కలలు కన్న స్థాయిలో ఇవ్వలేక పోతున్నాను. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరువాత ప్రభుత్వం నుంచి కొంత సహాయం దొరికినప్పటికీ అది ఒక ప్రొఫెషనల్ రిపర్టరీకి అవసరమైనంత దొరకక పోవడం దురదృష్టం. అదే నాటకం వేసినంక ఒక సంవత్సరానికి బిల్లులు రావడం దుఃఖదాయకమయిన విషయం. నాకు రాష్ట్రం వచ్చినంక ఒక్క రాష్ట్రస్థాయి అవార్డు మాత్రం ఇచ్చారు. జనపదం అధ్యక్షులు ప్రముఖ విమర్శకుడు అంబటి సురేంద్ర రాజు నేను కలిసి గత ముఖ్యమంత్రిని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాము. కలవనీయయలేదు. ఈ ముఖ్యమంత్రి కూడా టైం ఇవ్వడం లేదు. ఆ ప్రభుత్వం లోనూ ఈ ప్రభుత్వం కానీ అసలు కల్చరల్ పాలసీనే లేదు. అన్ని ప్రభుత్వాలు నాటకరంగాన్ని, అన్ని రకాల కళాకారులనూ పక్కన పెట్టేశారు. కళలను వేషాలు వేసుకుని రోడ్లమీద ఎగిరే స్థాయికి దించుతున్నారు.