రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...
కామారెడ్డి (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. గురువారం లింగం పేట్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. తొలుత మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రోడ్డు భద్రతలపై సమాజంలో ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగి ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వాహనాలు నడిపే ముందు సాధారణ రూల్స్ తెలిసి ఉండాలని, తప్పుడు త్రోవలో వాహనాలను నడుపకూడదని, అలా నడిపే సమయంలో ప్రమాదాలు జరగవచ్చని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడడం చేయకూడదని, వాహనాలు అతివేగంగా నడిపించకూడదని, హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడుపకూడదని తెలిపారు. లింగం పేట్ లో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దలనీ తెలిపారు.
సామాజిక సేవలో భాగంగా దాతలు 200 హెల్మెట్ లు పంపిణీ చేయడం జరుగుతున్నదని, వాటిని తప్పని సరిగా ధరించి వాహనాలు నడుపాలని తెలిపారు. పోలీసు వారి సహకారంతో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. అతి వేగం, రాష్ గా వెళ్ళడం వలన ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. జిల్లా రవాణా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సగటున దేశంలో 1.70 లక్షల మంది, రాష్ట్రంలో 6000 మంది, కామారెడ్డి జిల్లాలో 270 మంది ప్రమాదాల వలన మరణిస్తున్నారని తెలిపారు. అతివేగం ప్రమాదాలకు కారణమని అన్నారు. ప్రతీ వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని, షీట్ బెల్ట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్, హెల్మెట్ లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, అడ్వకేట్ మొయిన్ అహ్మద్ ఖాద్రి, డిఎస్పీ, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.