calender_icon.png 17 October, 2024 | 5:58 AM

అందరూ పార్టీ లైన్‌లో పనిచేయాల్సిందే

17-10-2024 02:01:35 AM

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): నాయకులు, కార్యకర్తలందరూ పార్టీ లైన్‌లోనే పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బుధవారం గాంధీభవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. గ్రేటర్‌లో విజయం సాధిస్తేనే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. 

అందుకే హైడ్రా తెచ్చాం..

బీఆర్‌ఎస్ హయాంలోనే అధికారులు, నాయకులు యథేచ్ఛగా చెరువులను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. వయనాడ్‌లో జరిగిన వివత్తు హైదరాబాద్‌లో రాకూడదనే హైడ్రా ప్రాజెక్టు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్ని నాటకాలు వేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు.

ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ దృక్పథంతో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. విభేదాలు అన్ని మరిచిపోయి పార్టీ పటిష్టత కోసం కలిసి పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా పనులు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాధం, మేయర్ విజయలక్ష్మీ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, సమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.