27-02-2025 03:26:55 PM
పోలింగ్ బూత్ పరిశీలనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, (విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో(Election of Graduate Teachers MLC) ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Collector Sri Harsha ) సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పట్టభద్రులు, టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ శాసన మండలి లో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ స్థానాల కోసం గురువారం ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, 36 పోలింగ్ కేంద్రాలలో గ్రాడ్యుయేట్స్, 14 పోలింగ్ కేంద్రాలలో టీచర్స్ తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారని తెలిపారు.
జిల్లాలో దాదాపు 31 వేల గ్రాడ్యుయేట్ ఓటర్స్, 1100 మంది టీచర్ ఓటర్స్ ఉన్నారని, 7 రూట్ లలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి దగ్గర జిల్లాలో పోలింగ్ సకాలంలో ప్రారంభమైందని, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారని, సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఉదయం 10 గంటల వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో పురుషులు 1467 మంది, మహిళలు 621 మొత్తం 2088 మంది ఓటర్లు అనగా 6.73 శాతం, టీచర్స్ ఎన్నికలలో పురుషులు 100 మంది, మహిళలు 52 మొత్తం 152 మంది ఓటర్లు అనగా 13.68 శాతం పోలింగ్ జరిగిందని, పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్న రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ లను తరలించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కోసం అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు కట్టు దిట్టంగా చేశామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లంతా పోలింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తాహసిల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.