calender_icon.png 14 March, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మకాల్లో అడుగడుగునా దగా!

13-03-2025 12:00:00 AM

  1. తూనికకు రాళ్లు... కాటాలకు వేయని సీళ్లు
  2. తూకంలో మోసం చేస్తున్న వ్యాపారులు
  3. తనిఖీలు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం

సూర్యాపేట, మార్చి 12 (విజయక్రాంతి): ‘ఇందుగలడందు లేడని సందేహం వలదు... ఎందెందు వెదకి చూసినా... అందందేగలదు’ అన్నట్టు జిల్లాలో ఎక్కడ చూసినా తూనికలు... కొలతల్లో దగా... మోసం... కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న కిరాణా కొట్టు మొదలు... పెద్ద పెద్ద బంగారు దుకాణాల వరకూ తూనికల్లో మోసాలకు పాల్పడుతున్నాయి.

పాల నుంచి పెట్రోల్ వరకూ కొలతల్లో దగా చేస్తున్నారు. దీనివల్ల సగటు వినియోగదారుడు నిరంతరం మోస పోతూనే ఉన్నాడు. వీటిని నియంత్రించగల అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు నామమాత్రంగా దాడులకు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

జిల్లాలో70 వేల వరకు వ్యాపారులు..

వ్యాపారుల్లో అత్యాశ పెరిగిపోతోంది. చిన్న కిరాణా కొట్టు మొదలుకుని బంగారు షాపు వరకు ఎక్కడికి వెళ్లినా వినియోగదారుడిని మోసం చేస్తున్నారు. చివరకు రేషన్డీలర్లు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దుకాణాల్లో వేసిన తూకం... ఇంటికెళ్లి చూస్తే తేడా కనిపిస్తోంది.

ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరత పేరుతో చోద్యం చూస్తోంది. కిరాణం, వస్త్ర దుకాణాలు, ప్యాన్సీ, హార్డ్వేర్, బంగారు షాపులు, ఇలా వివిధ రకాల దుకాణాలు జిల్లాలో 30  వేల వరకూ ఉన్నాయి. ఇక  చిరువ్యాపారులను కలుపుకుంటే 70 వేల మందికి పైగానే ఉంటారు.

వినియోగదారుడికి తెలియకుండానే మోసం..

ఆయా దుకాణాల్లో ఘన పదార్థాలైతే తూకాలు, ద్రవ పదార్థాలైతే కొలతల్లో విక్రయిస్తారు. వీటికి నిర్థిష్ట ప్రమాణాలు ఉంటాయి. అయితే కొందరు వ్యాపారులు ధన దాహంతో జిమ్మిక్కులు చేస్తున్నారు. వినియోగదారునికి తెలియకుండానే మోసం చేస్తున్నారు. తూనికలు%--% కొలతల శాఖ నిబంధనల ప్రకారం వ్యాపారి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా తూకం రాళ్లు, ఏటా కాటాకు ప్రభుత్వ పరమైన ముద్రలు వేయించుకోవాలి.

కాటాలో తేడాలు వస్తే రిపేరర్ వద్దకు వెళ్లి సరిచేయించుకోవాలి. అలా చాలా మంది వ్యాపారులు చేయించుకోవటం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా సూర్యాపేట, కోదాడ, హుజుర్నగర్, తిరుమలగిరిలో ప్రధార వ్యాపారాలతో పాటు మండల కేంద్రాలలో  నిత్యం వ్యాపారం సాగుతుంది. అయితే సాదారణ కాంటాలకే కాంకుండా  ఎలక్ట్రికల్ కాటాలతో సైతం వ్యాపారులు అక్రమాలకు తెరతీస్తున్నారు.

ముందుగా వంద గ్రాములు తగ్గించి జీరో వచ్చేలా అమర్చుతున్నారు. కొన్ని దుకాణాల్లో కాటాపై ఉన్న పళ్లెం బరువును లెక్కించకుండా తూకంలో కలిపేసి మోసాలకు పాల్పడుతున్నారు. కేజీకి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకే అధిక శాతం దుకాణాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. అంతే కాకుండా వేబిడ్డీ కాంటాలు, పత్తి, వరి ధాన్యం దుకాణాలలో నిత్యం అవకతవకలు జరుగుతున్నాయి.

తూనికలు కొలతలు శాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో వ్యాపారులు అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అంతే కాకుండా కాంటాల తనిఖిల పేరుతో ఒకరు దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

చర్యలు తీసుకుంటాం..  

తూకంలో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు, ప్రైవేటు వ్యక్తులు తనిఖీలు చేయరు.  అలా జరిగినట్లు పిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.

 చిట్టిబాబు, జిల్లా తునికలు, కొలతల అధికారి