మెదక్ (విజయక్రాంతి): ప్రతి పేదవారు ఉన్నత విద్యను అభ్యసించాలని భావించి, దానికి అనుగుణంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ మెంచు నగేష్ పేర్కొన్నారు. సోమవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136 జయంతిని పురస్కరించుకొని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత ఇతర శాఖల అధికారులు మైనారిటీ పెద్దలతో కలిసి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనగావించి మౌలానా ఆబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో సాహిత్యం, విద్యా వికాసాల కొరకు చిరస్మరణీయ కృషి చేసిన వ్యక్తిగా, చరిత్రపుటలకెక్కిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని కొనియాడారు. ఈరోజు ఆ దేశభక్తుని జయంతి సందర్భంగా విద్యారంగంలో శాస్త్ర, సాంకేతిక, స్త్రీ విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు, పండితుడు, కవిగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1992లో మరణానంతరం అతనికి భారతరత్న పురస్కారం లభించింది అన్నారు. హిందూ-ముస్లిం ఐక్యత కోసం పోరాడిన అతను స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేశాడు అని వివరించారు.
జాతీయ విద్య దివోత్సవం శుభాకాంక్షలు "విద్య నేర్చుకో విలువ పెంచుకో ఈ ప్రపంచాన్నే మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉందన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా భారత దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, జమ్లా నాయక్ ఏవో యూనిస్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి నాగరాజుగౌడ్, ఇంటర్మీడియట్ అధికారి జి మాధవి, గిరిజన సంక్షేమ అధికారి, సంబంధిత ఇతర శాఖల అధికారులు, మైనారిటీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.