- మొక్కల పెంపకంపై ఆడిట్ చేయాలి
- రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలి
- పాఠశాలల్లో హాజరు శాతం పెంచాలి
- రోగులకు మైరుగైన వైద్యం అందించాలి
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- భూపాలపల్లి, పెద్దపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పెద్దపల్లి(మంథని), జూలై 3 (విజయక్రాంతి): వన మహూత్సవంలో నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. బుధవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించిన మంత్రి.. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా పెద్దపల్లిలోని పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద వనమహోత్సవం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే విజయరమణరావుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంపై కచ్చితమైన ఆడిట్ నిర్వహించాలని, ఇంటింటికి వెళ్లి సర్వే చేసి మొక్కల స్థితిగతులను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మంత్రి శ్రీధర్‌బాబు కాంట్రాక్టర్లను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ నుంచి రుద్రారం వరకు రూ.20 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు పనులకు కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. మల్హర్ మండలంలోని వల్లెంకుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.12 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కాటారం ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు. అర్హులైన వారికే సంక్షేమ పథకాలు చెందాలని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహదేవపూర్ ఎంపీడీవో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ కో ఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించారు.
మండల పరిధిలోని 2,600 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండో దశ దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎంఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. బుధవారం పెద్దపల్లిలో ఎంఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు సంబంధించి తక్కువ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ మోహిన్‌పాషాను కోరారు.