రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
ఎల్బీనగర్: ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు 2025 పురస్కరించుకొని హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై పాఠశాల ప్రాంగణం నుంచి ఎంపీడీవో ఆఫీస్ వరకు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు రోడ్లపై పలు జాగ్రత్తలు పాటించాలని, వాహనదారులు తప్పనిసరిగా రోడ్ భద్రత నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు.
అతివేగంగా వాహనం నడిపితే అదుపుతప్పి ప్రమాదానికి గురై అవకాశం ఉందని, రాంగ్ రూట్లో వాహనం నడపడం, మైనర్ ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ... వాహనం నడపడం చేయరాదన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు, స్కూల్ పిల్లలను తరలించవద్దని సూచించారు. రోడ్డు భద్రత నియమా నిబంధనలు పాటించకపోవడంతో ప్రతి సంవత్సరం చాలామంది వాహనదారులు ప్రమాదాల బారినపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త వహిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాలు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఇందిర, ఎంఈవో శ్రీనివాస్, పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, మోటర్ ట్రాన్స్ పోర్ట్ ఇన్ స్పెక్టర్, ఆర్టీవో, ఎస్సైలు, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు పారంద మహేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవిందచారి తదితరులు పాల్గొన్నారు.