calender_icon.png 10 January, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఆడపిల్ల గౌరమ్మే!

08-10-2024 12:00:00 AM

“పూలనే దైవంగా భావించే గొప్ప సంస్కృతి మనది. అయితే బతుకమ్మ పండుగను ఎలా గౌరవించుకుంటున్నామో.. ప్రతి అడపిల్లనూ అలాగే గౌరవించుకోవాలి. సమాజంలో ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు ఆగినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది” అని అంటారు సింగర్ స్వర్ణక్క. బతుకమ్మ పండుగ సందర్భంగా తన పాటల ఎలా మొదలైంది? పూల పండుగతో తనకున్న అనుబంధం ఎలాంటిదో తన అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారామె. 

స్వర్ణక్క అంటే అందరికీ ఉద్యమ పాటలే గుర్తుకువస్తాయి. కానీ నేను మహిళల గొప్పతనం, ఆడపిల్లల రక్షణ కోసం ఎన్నో పాటలు పాడా. బతుకమ్మ పాటల్లో మంచి యాస ఉంటుంది. ప్రాస ఉంటుంది. అంతకుమించి గొప్ప సంస్కృతి ఉంటుంది. అందుకే బతుకమ్మ అంటే ఆడపిల్లలకే కాదు.. ప్రతిఒక్కరికి ఇష్టం. బతుకమ్మ పూలలో ఎన్ని రంగులుంటాయో.. అలాగే మనుషుల మనస్తత్వాల్లో అనేక రంగులుంటాయి.

పూలన్నీ ఒకచోట చేరితే బతుకమ్మగా ఎలా రూపుదిద్దుకుంటుందో..  మనుషులు కూడా కులాలు, అసమానతలు పక్కన పెడితే అందమైన బతుకమ్మ మాదిరిగా అందమైన సాధించుకోవచ్చు. ఆడైనా, మగైనా తల్లి గర్భంనుంచే పుడతారు. అలాంటప్పుడు ఆడపిల్లపై చిన్నచూపు చూసే ధోరణి మారాలి. మనం బతుకమ్మను ఎలాగో గౌరవించుకుంటున్నామో.. ఆడపిల్లను అలా గౌరవించుకోవాలి.

అప్పుడే బంగారు తెలంగాణ ఏర్పడుతుంది. నేను బతుకమ్మ పాటలు పాడింది తక్కువే అయినా.. అవన్నీ మంచి పేరు తీసుకొచ్చాయి. “బతుకమ్మా బతుకమ్మా ఉయ్యాలో.. ఆడపిల్ల బతుకు మారాలి ఉయ్యాలో” లాంటి పాటలు పాడా. కానీ 2018లో ‘రంగుపూల రాసులెల్లా నవ్వులు ఒంపెనా.. నింగి సింగిడి వంగి నాట్యమాడేనా’ అనే పాట ఉరూరా మార్మోగింది. ఇప్పటికీ ఈ పాట తెలంగాణలోని ప్రతి  గల్లీలో వినిపిస్తుంటుంది. 

పాటను ప్రేమించే కుటుంబం 

మాది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక గ్రామం. అమ్మ శాంతమ్మ, నాన్న నర్సయ్య, ఐదుగురు సంతానం. అందరి కంటే చిన్నదాన్ని. మా అక్క జ్యోతి పాటలు బాగా పాడేది. ఆ అభిరుచే నాకు అబ్బింది. అలా ఊహ తెలియని వయసులోనే పాటతో ప్రయాణం మొదలుపెట్టా. కవి జయరాజు, గద్దరన్న పాటలు విని పాడేదాన్ని.

మూడో తరగతి చదివే సమయంలో ‘తెలుగు వీర లేవరా’ అనే పాట పాడా. ఆ పాట వినగానే.. ‘ఈ పిల్లలో ఏదో మ్యాజిక్ ఉంది’ అంటూ గామ్రస్తులు, టీచర్లు మెచ్చుకున్నారు. అలాగే మొదటిసారి కంజర కొట్టి పాటలు పాడింది నేనే. అయితే పాటతో ప్రయాణం మొదలుపెట్టినా ఏ రోజు కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదు. పదో తరగతిలో మంచి మార్కులతో పాసయ్యాను.

ఆడపిల్ల ఓ ఝాన్సీరాణి

నేను చదువుకునే సమయంలో తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో మూఢనమ్మకాలు, వరకట్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. భర్త వేధింపులు, వరకట్న సమస్యలు తట్టుకోలేక ఎంతోమంది మహిళలు చెరువుల్లో, బావుల్లో దూకి చనిపోయే వారు. అందుకే అలాంటి దారు ణమైన పరిస్థితులు మారాలని ‘గంగలోకి దూకకమ్మా.. నిండు ప్రాణం తీయకమ్మా..’ అనే పాట పాడాను.

ఝాన్సీ రాణివై లేవవే ఓ చెల్లెమ్మా.. వరకట్నం అడి గితే నాలుకలే కోసేయాల మ్మా’ అనే పాట తో వరకట్న దు రాచారంపై అవ గాహన కల్పించా. డిగ్రీ చదువుకునే సమయంలో నేను కుటుంబానికి ఎక్కువ దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ‘అమ్మా... క్షేమమా.. మా అమ్మా క్షేమమా.. అన్మనిచ్చినావే.. నాకు రూపమిచ్చినాదే..’ పాట అప్పట్లో ఎంతోమంది చేత కన్నీళ్లు పెట్టించింది. 

ఆ బలిదానం నన్ను కదిలించింది

పాటలే కాదు.. తెలంగాణ ఉద్యమం నా జీవితాన్ని మలుపుతిప్పింది. అది 2009 డిసెంబర్.  తెలంగాణ మహోద్యమం సెగలు కక్కుతున్న సమయం. ఉస్మా నియా విశ్వవిద్యాలయం ఆ సెగలను సిగలో పెట్టుకుని ఉద్యమానికి ఊతమిస్తోంది. ముళ్ళకంచెలు, టియర్ గ్యాస్ బాంబులు, పోలీసు పహారాలతో ఓయూ బంధిం చబడ్డది. అవన్నీ నన్ను భావోద్వేగపర్చాయి.

‘జై తెలంగాణ’ అని నినదించగానే.. నాలాంటివాళ్లు ‘జై తెలంగాణ’ నినాదంతో గర్జించారు. అయితే పాటే ప్రాణంగా, ఉద్యమమే ఊపిరిగా బతికినవారు ఎక్కడున్నా పాటను వదిలి ఉండడానికి ఇష్టపడరు. నేను కూడా అంతే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలిదానం నన్ను తీవ్రంగా కలిచివేసింది. అందుకే ఆనాటి నుంచే ‘ఇక ఉద్యమ గీతాలే పాడాలి‘ అని నిర్ణయించుకున్నా.

తెలంగాణ రగడ-, తెలంగాణ ధూం ధాం సభల్లో గజ్జెకట్టి ఆడిపాడా. ‘అదిగదిగో తెలంగాణ సమరభేరి మోగే... అన్నాలారా రారండి‘ అనే పాటతో ఉద్యమాన్ని ఉర్రుతలూగించా. అప్పుడే పాట గొప్పతనం మరింత అర్ధమైంది. నా ప్రతిభను గురించిన తెలంగాణ కళాకారులు, మేధావులు నాచేత వేలాది పాటలు పాడించి ప్రోత్సహించారు.

ఫలితంగా అమెరికా, సింగపూర్, దుబాయ్ లాంటి వేదికలపై తెలంగాణ మట్టి గొప్పతనం, అమరత్వం, ఉద్యమ నినాదం బలంగా చాటా. ఫలితంగా 2017లో తెలంగాణ ప్రభుత్వం ‘ఉత్తమ ఉద్యమ గాయకురాలు’గా గుర్తించి సత్కరించింది. అయితే నా పేరు స్వర్ణ అయినా.. ప్రజలు మాత్రం నన్ను ‘స్వర్ణక్క’ అని అప్యాయంగా పిలుస్తారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని విషయం. 

పేరు తెచ్చిన పాటలు కొన్ని..

* అదిగదిగో తెలంగాణ.. 

సమరభేరి మోగే అన్నలారా రారండి. 

* జనజాతరలో మన గీతం 

* రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా 

* ఉద్యమాల వీరుల కన్నా వీర తెలంగాణ 

* అమ్మా తెలంగాణమా.. 

ఆకలి కేకల గానమా..

- బాలు జాజాల