calender_icon.png 20 November, 2024 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఎవర్‌నార్త్ జీసీసీ

20-11-2024 01:36:39 AM

వెయ్యి మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 19 (విజయ క్రాంతి): హైటెక్‌సిటీలోని సత్వ నాలెడ్జ్ పార్కులో ఎవర్‌నార్త్ ఆరోగ్య సంస్థకు చెందిన.. దేశంలోనే తొలి గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ)ను మంగళవారం ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఎవర్‌నార్త్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుతో మొదటి దశలో 1000 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.

నూతన ఆవిష్కరణకు ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిర పర్చుకుంటున్నదని సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఆధునిక కేంద్రం హైదరాబాద్ లోని నిపుణుల సామర్థ్యాన్ని వినియోగించుకుని ఆరోగ్యరంగంలో ఐటీ వినియోగాన్ని మరింత విస్తృతపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బెంగుళూరులోని సిగ్నా హెల్త్ సొల్యూషన్స్ సంస్థ, అంతర్జాతీయ ఆరోగ్య వ్యాపారానికి డేటా, అనలిటిక్స్ లాంటి సాంకేతిక సేవలను అందించే కేంద్రంగా ఎవర్‌నార్త్ పనిచేస్తుందని వివరించారు. సిగ్నా సంయుక్త భాగస్వామ్యం ద్వారా ఎవర్‌నార్త్ 1.9 కోట్ల భారతీయులకు ఆరోగ్య సేవలను అందిస్తోందని తెలిపారు.

75 వేల మంది ఉద్యోగులు, 30 కిపైగా దేశాల్లో 18.6 కోట్ల వినియోగదారులతో, ఆరోగ్య సేవల రంగంలో నూతన ఆవిష్కరణలకు, ఇంటెలిజెన్స్‌కు దోహదం చేస్తోందని వెల్లడించారు. ఎవర్‌నార్త్ జీసీసీ కేంద్రం 4 లక్షల చదరు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల పరోక్షం గా కూడా ఎంతో మందికి ఉపాధి అవకాశా లు ఏర్పడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమం లో సిగ్నా గ్రూప్ ప్రధాన సమాచార అధికారి నోయెల్ ఎడర్, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.