calender_icon.png 21 January, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవర్‌గ్రీన్ జీనత్

20-01-2025 12:00:00 AM

వెండితెరపై అందాల భామలకు కొదువేం లేదు. ఇప్పుడే కాదు.. అప్పట్లోనూ లెక్కలేనంత మంది ఉన్నారు. అలాంటి వారిలో జీనత్ అమన్ ఒకరు. 1970లలో తన గ్లామర్‌తో సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. ‘దమ్ మారో దమ్’ అంటూ యూత్‌కు పిచ్చెక్కించారు. అందాల పోటీల్లో విజేతగా గెలిచి సినీ పరిశ్రమలో జీనత్ అడుగు పెట్టారు. తెరపై ఆమెను చూసిన యువకులు.. స్వప్నం లోకంలో తమ సామ్రాజ్యానికి ఆమెను పట్టపురాణిని చేసుకున్నారు. అందానికి ఐకాన్‌లా కనిపించే ఆమెను చూసిన వారంతా మైమరచిపోయేవారు. కట్ చేస్తే ఇదంతా రీల్ లైఫ్‌లో మాత్రమే.. రియల్ లైఫ్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు.

‘ఫెమినా మిస్ ఇండియా’, ‘మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్’ వంటి అందాల పోటీల్లో విన్నర్‌గా జీనత్ నిలిచారు. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. అక్కడి నుంచి సినీరంగంలోకి అడుగు పెట్టారు. ఆమెను చూసిన దేవానంద్ ఆమె అందానికి దాసోహమయ్యారట. తాను నటించిన ఇండో ఫిలిపియన్ మూవీ ‘ది ఈవిల్ వితిన్’లో కీలక పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు.

ఆ తరువాత ‘హల్ చల్’ అనే హిందీ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఆ తరువాత దేవానంద్ తన దర్శకత్వంలో వచ్చిన ‘హరే రామ హరే కృష్ణ’లోనూ జీనత్‌కు అవకాశం కల్పించారు. ‘యాదోంకీ బారాత్, రోటీ కపడా ఔర్ మకాన్, అజనబీ, చోరీ మేరా కామ్’ వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. అందం, అభినయం రెండూ ఉండటంతో ఆమెకు అప్పట్లో తిరుగనేదే లేకుండా పోయింది.

ఆమె రీల్ లైఫ్ అంతా పున్నమి వెన్నెల.. ముగ్దమనోహరమైన ఆమె రూపాన్ని ఎంతోమంది సాధారణ యువకులే కాకుండా స్టారో హీరోలు ఆరాధించారు. జీనత్ ప్రేమ కోసం అప్పటి ప్రముఖ నటుడు దేవానంద్ తపించేవారట. కానీ ఇష్క్ ఇష్క్ ఇష్క్ సినిమాలో జీనత్ నటనను అభినందిస్తూ ఆమెను రాజ్‌కపూర్ ఓ ఈవెంట్‌లో పబ్లిక్‌గా ముద్దు పెట్టారట. అది చూసిన దేవానంద్‌కు గుండె పగిలినంత పనైందట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఆటోబయోగ్రఫీలో వెల్లడించారు. 

నరకం చూపించిన మొదటి భర్త

ఇక రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఎన్నో అనుకోని సంఘటనలు. ఆమెపై లెక్కలేనన్ని రూమర్స్.. రెండు పెళ్లిళ్లు.. మొత్తానికి ప్రస్తుతం ఆమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ‘ముందు సహజీవనం.. తర్వాతే పెళ్లి’ అని చెప్పి వార్తలకెక్కారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు సంచలనానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టినవారు, వ్యతిరేకించిన వారు చాలా మంది ఉన్నారు.

1978లో నటుడు సంజయ్ ఖాన్‌ను జీనత్ వివాహమాడారు. జీనత్‌కు సంజయ్ నరకం చూపించారట. ఒకసారి ఆమెను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆసుపత్రిపాలయ్యారు. ఆ తరువాత అంటే వివాహమైన ఏడాదికే వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత జీనత్.. 1985లో నటుడు మజర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు కూడా అప్పటికే వివాహమై భార్యతో విడిపోయారు. జీనత్, మజర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 1998లో మజర్ కన్నుమూశారు. 

లైంగిక వేధింపుల కేసు..

ఆ బాధ నుంచి బయటపడేందుకు తిరిగి సినిమాల్లోకి జీనత్ రీఎంట్రీ ఇచ్చారు. ‘భోపాల్ ఎక్స్‌ప్రెస్, బూమ్, అగ్లీ ఔర్ పగ్లీ’ వంటి పలు చిత్రాల్లో నటించారు. 2018లో అమన్ ఖన్నా అనే బిజినెస్ మ్యాన్‌పై జీనత్ లైంగిక వేధింపుల కేస్ ఫైల్ చేశారు.

అమన్ ఖన్నా తనను చిత్రహింసలకు గురి చేశాడని.. ఎన్నోసార్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొన్నారు. జీనత్, అమన్ ఖన్నా ఇద్దరూ వివాహం చేసుకున్నారంటూ రూమర్స్ కూడా వచ్చాయి కానీ వాటికి ఆధారాలేమీ లేవు. ప్రస్తుతం అంటే 75 ఏళ్ల వయసులో జీనత్ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు.