calender_icon.png 2 October, 2024 | 3:51 PM

ఎత్తు పెరుగుతున్న ఎవరెస్ట్

02-10-2024 01:51:20 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం మరింత ఎత్తు పెరుగుతున్నదని నేచర్ జియో సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు. ఈ మంచు శిఖరం ఎత్తు పెరుగుతున్న విషయాన్ని గతంలోనే గుర్తించినా.. అంచనాకు మించిన వేగంతో పెరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఎవరెస్ట్ ప్రస్తుత ఎత్తు 8.85 కిలోమీటర్లు.

ఇండియా యూరేషియా టెక్టానిక్ ప్లేట్లు పరస్పరం గుద్దుకోవటం వల్ల ఏర్పడిన హిమాలయాలు 5 కోట్ల ఏండ్లుగా పెరుగుతూనే ఉన్నాయని ఇదివరకే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. హిమాలయాల్లోని నదీ వ్యవస్థల్లో వస్తున్న మార్పుల వల్లనే ఎవరెస్ట్ శిఖరం వేగంగా ఎత్తు పెరుగున్నదని చైనా పరిశోధకుడు జిన్‌జెన్‌దై పేర్కొన్నారు.

89 వేల ఏండ్ల క్రితం అరుణ్ కోసీ నదులు కలిసిపోవటంతో ఎవరెస్ట్ శిఖరం 49 నుంచి 164 అడుగులు పెరిగిందని వివరించారు. చిన్న నదులు కలిసి భారీ నదిగా ఏర్పడి పెద్ద మొత్తంలో మట్టి, రాళ్లను అక్కడి నుంచి తరలించుకుపోవటంతో భూ పటలంపై ఆ ప్రాంతంలో ఒత్తిడి తగ్గి శిఖరం పెరుగుతున్నదని తెలిపారు.