calender_icon.png 17 November, 2024 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం లేకున్నా సాగు బాగు!

17-11-2024 12:32:50 AM

  1. నిర్వహణకు రూపాయి ఖర్చు చేయలె
  2. ప్రాజెక్టు నుంచి బొట్టు నీరు పారలేదు
  3. అయినా రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం
  4. గతేడాది 65.94 లక్షల ఎకరాల్లో సాగు
  5. ఈసారి 66.77 లక్షల ఎకరాలకు చేరిక
  6. కాళేశ్వరం అవసరమే లేదంటున్న గణాంకాలు
  7. అయోమయంలో బీఆర్‌ఎస్ వర్గాలు

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): రూపాయి ఖర్చు పెట్టలేదు.. చుక్క నీరు ఎత్తిపోయలేదు.. ఈ వానకాలంలో కా ళేశ్వరం ప్రాజెక్టు అన్న ఊసేలేదు.. అయినా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది వానకాలంలో 65.94 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బొట్టు నీరు విడుదల కాకుండానే 66.77 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిచారు.

దీంతో ఆ ప్రాజెక్టు వల్లే తెలంగాణ పచ్చబడిందన్న నాటి పాలకుల మాటలు అబద్ధాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఆ ప్రాజెక్టు రైతుల కోసం కాదని, కాంట్రాక్టర్ల కోసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా కాళేశ్వరంపై వేసిన జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ కూడా ప్రాజెక్టులోని లోపాలను ఎత్తిచూపుతోంది.

ఎకరానికి రూ.21,810 ఖర్చు

కాళేశ్వరం ప్రాజెక్టును కాగ్ కూడా ఎండగట్టింది. రాష్ట్రానికి పెనుభారంగా మారుతుం దని దుయ్యబట్టింది. ఈ ప్రాజెక్టుకు రూపా యి ఖర్చు చేస్తే.. 52 పైసలు మాత్రమే తిరిగి వస్తుందని హెచ్చరించింది. ఇదే సమయం లో దీనికి వినియోగించే విద్యుత్‌కు కూడా భారీగా ఖర్చు అవుతుందని చెప్పింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. మొత్తం 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వినియోగంలో వస్తుం దని బీఆర్‌ఎస్ సర్కార్ అంచనా వేసింది.

కానీ, అది సాధ్యం కాలేదు. కాళేశ్వరం కింద కేవలం 40 వేల ఎకరాలు మాత్రమే సాగైన ట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ్రప్రకటించింది. ఈ ప్రాజెక్టు నుంచి ఒక్క టీఎంసీని ఎత్తిపోయడానికి రూ.25 కోట్ల వరకు విద్యుత్ చార్జీలు అయ్యాయని.. ఈ లెక్కన ఒక ఎకరానికి రూ.21,810 నాటి సర్కారు ఖర్చు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఈ క్రమంలో ఈ ఖర్చు లేకుండానే ఈ సారి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం.

రూ.3600 కోట్ల విద్యుత్ బకాయిలు

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయకుండానే నాటి సర్కారు పంప్‌హౌస్‌లను ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యత్ బకాయిలు రూ.3600 కోట్ల్లకు పేరుకుపోయాయి. 

లక్షలు ఖర్చు చేసినా దమ్మిడి ఆదాయం లేదు

కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక మంది నిపుణులు ఈ ప్రాజెక్టు సరైనది కాదని, ఇదొక తెల్ల ఎనుగు అని, కమీషన్లకు కామధేనువు లాంటిదని వ్యాఖ్యానించారు. కానీ, నాటి ప్రభుత్వంలోని పెద్దలు ఒంటెత్తు పోకడతో ప్రాజెక్టును నిర్మించేందుకే ముందుకొచ్చారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి వేల కోట్ల మేర అంచనాలను పెంచారు.

రూ.38 వేల కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు నిర్మాణానికి ఏకంగా రూ.90 వేల కోట్లు ఖర్చు చేశారు. అంత ఖర్చు చేసినా ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తికాకపోగా, కుంగిపోయింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయాలంటే రూ.1.4 లక్షల కోట్లు అవుతుందని కాగ్ చెప్తోంది. వడ్డీలు, అప్పులు కలిపి దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా దీని ద్వారా ప్రభుత్వానికి దమ్మిడి రాబడి రాకపోడవడం శోచనీయం.

బీఆర్‌ఎస్‌పై సర్కారు ఎదురుదాడి 

వానకాలం పంటసాగు మొదలైన తర్వాత కాలువల్లో కాళేశ్వరం నీళ్లు పారలేదు. ప్రాజెక్టు కుంగుబాటు కారణంగా నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం పంపింగ్ ఆపేసింది. ఈ క్రమంలో కాలువల్లో కాళేశ్వరం నీరు పారకపోవడంపై కాంగ్రెస్ సర్కారుపై బీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వరప్రదాయినిలాంటి కాళేశ్వ రం ప్రాజెక్టును బాగుచేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది.

కానీ, ప్రతిపక్షం మాటలను వినకుండా నిపుణు ల సూచన మేరకు ప్రభుత్వం నీటిని ని లిపివేసింది. దీంతో కాళేశ్వరం లేకున్నా రాష్ట్రంలో సాగు విస్తీర్ణానికి ఢోకా లేద ని తాజా గణాంకాలతో స్పష్టమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్ల అని, దాన్ని కమీషన్ల కోసమే నాటి సర్కారు తలపెట్టిందంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు.. బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యం లో ఈ విషయంలో అధికారం పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అయోమయంలో బీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.