* ఆసీస్‌లో సిరీస్ అంటే ఆషామాషీగా ఉండదు.. అని అంతా అన్నట్లుగానే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. పొద్దున లేచి టీవీలు చూసేసరికే భారత్ టాస్ గెలవడం ఓ వికెట్ కోల్పోవడం కూడా జరిగిపోయింది. దీంతో భారత అభిమానుల్లో మొదలైన ఆందోళన అంతకంతకూ పెరిగిపోయింది. కానీ ఆసీస్ బ్యాటింగ్ మొదలుపెట్టిన తర్వాత మన బౌలర్లు వారిని ‘కంగారు’పెట్టారు. నిప్పులు చెరిగే బంతులతో కంగారూలకే కంగారును పరిచయం చేశారు.
మొదటిరోజు భారత్‌దే పైచేయి
- మెరిసిన తెలుగు తేజం
- 50 ఓవర్లు కూడా ఆడని బ్యాటర్లు
- చేతులెత్తేసిన టాపార్డర్
- నిప్పులు చెరిగిన బౌలర్లు
విజయక్రాంతి ఖేల్ విభాగం: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కేవలం 150 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలను మన బౌలర్లు కంగారుపెట్టారు.
కెప్టెన్ బుమ్రా, పేస్ గుర్రం సిరాజ్, కొత్త కుర్రాడు హర్షిత్ రానాల దెబ్బకు కంగారూ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రోజు ముగిసే సరికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు మాత్రమే చేయగల్గింది. నేడు రెండో రోజు ఆటలో పరిస్థితులు ఎలా మారుతాయో..
కొత్త కుర్రాళ్ల ఎంట్రీ
ఈ సిరీస్‌తో కొత్త కుర్రాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానాలకు అవకాశం దక్కింది. ఈ ఇద్దరు ఆటగాళ్లకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్యాప్ అందించారు. నితీశ్ రెడ్డి భారత్ తరఫున ఆడుతున్న 315వ టెస్టు ప్లేయర్ కాగా, హర్షిత్ రానా 316వ టెస్టు ప్లేయర్.
ఆకట్టుకున్న నితీశ్‌కుమార్‌రెడ్డి..
టాస్ గెలిచిన ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. ఈ టెస్టుకు రెగ్యులర్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన రాహుల్, జైస్వాల్ 10 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేకపోయారు. స్టార్క్ వేసిన 3వ ఓవర్లోనే జైస్వాల్ (0) గల్లీలో కొత్త కుర్రాడు మెక్‌స్వీనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక అప్పటి నుంచి ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. మన బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు.
టాపార్డర్ టపాటపా
ఓపెనర్ జైస్వాల్ తర్వాత గిల్ గైర్హాజరీలో చోటు దక్కించుకున్న పడిక్కల్ (0) 23 బంతులాడినా కానీ పరుగుల ఖాతాను మాత్రం తెరవలేకపోయాడు. ఆడినంత సేపు ఇబ్బందిగా కనిపించిన పడిక్కల్ 11వ ఓవర్లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషభ్ పంత్ (37) కాసింత సేపు ఆడడంతో భారత్‌కు గౌరవప్రద స్కోరు లభించింది.
విరాట్ మరో‘సారీ’
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (5) మరోసారి నిరాశపర్చాడు. గత కొద్ది రోజులుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కింగ్ ఈ సిరీస్ ద్వారా అయినా ఫామ్ అందుకుంటాడని అంతా ఆశించారు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు క్రీజులోకి వచ్చిన కోహ్లీ 17వ ఓవర్లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక సీనియర్ బ్యాటర్ రాహుల్ (26) క్రీజులో నిలదొక్కుకునేందుకు చాలా సేపు ప్రయత్నించినా కానీ ఫలితం లేకుండా పోయింది.
నిప్పులు చెరిగిన బౌలర్లు
భారత్ 150 పరుగుల స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చారు. తొలి బంతినే కెప్టెన్ బుమ్రా నోబాల్‌గా వేయడంతో అంతా డీలాపడిపోయా రు. కానీ మూడో ఓవర్ వేసిన బుమ్రా కొత్తకుర్రాడు మెక్‌స్వీని(10)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఇక అప్పటి నుంచి ఆసీస్ వికెట్ల పతనం మొదలయింది. వచ్చీరావడంతో విరాట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన లబుషేన్ (2) 52 బంతులు ఆడినా కానీ సఫలం కాలేదు. బుమ్రా (4 వికెట్లు) మాత్రమే కాకుండా సిరాజ్ (2 వికెట్లు), కొత్త కుర్రాడు రానా (1) వికెట్ తీసుకుని కంగారూలను కంగారు పెట్టించారు. కేరీ (19*), స్టార్క్ (6*) క్రీజులో ఉన్నారు.
అదరగొట్టిన తెలుగు తేజం
ఆరంగ్రేటం చేసిన తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (41) తను ఎంత విలువైన ఆటగాడో చాటి చెప్పాడు. పదునైన బంతులు ఎదుర్కోలేక సీనియర్లే పెవిలియన్‌కు క్యూ కడుతున్న సమయంలో నితీశ్ ఓపిగ్గా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. నితీశ్-పంత్ భాగస్వామ్యం వల్లే భారత్ 150 పరుగుల మార్కును దాటగలిగింది.
భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. స్పెషలిస్టు బ్యాటర్లు విఫల మైన వేళ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ రెడ్డి సత్తా చాటాడు. ఆరంగ్రేటం చేసి 8వ డౌన్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి టాప్ స్కోరర్‌గా నిలిచిన ఏడో బ్యాటర్ నితీశ్ రెడ్డి.