calender_icon.png 5 March, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్లలో యాక్షన్ కోసం శిక్షణ తీసుకున్నా

04-03-2025 12:00:00 AM

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కింగ్‌స్టన్’. నిర్మాతగా జీవీ ప్రకాశ్‌కుమార్ తొలి చిత్రమిది. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. గంగా ఎంటర్‌టైన్ మెంట్స్ అధినేత మహేశ్వర్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మార్చి 7న విడుదల కానుంది.

ఈ సందర్భంగా జీవీ ప్రకాశ్ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. “ప్రొడక్షన్ చేయాలని కొన్ని రోజులుగా అనుకుంటున్నాను. కింగ్‌స్టన్ కథ నచ్చింది. అందుకే జీ స్టూడియోస్‌తో కలిసి చేశా. ‘కింగ్‌స్టన్’ను ఫ్రాంచైజీలా చేయాలని అనుకుంటున్నాం. మా దగ్గర నాలుగు పార్టుల వరకు కథ రెడీగా ఉంది. సముద్ర తీరం పక్కన ఉన్న ఓ ఊరి ప్రజలు సముద్రంలోకి వెళ్లరు. ఆ ఊరికి ఉన్న శాపాన్ని ఎదిరించాలని హీరో సముద్రంలోకి వెళ్తాడు.

అక్కడ ఏం జరిగిందనేది సినిమా. నాలుగు రోజుల పాటు అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం నేను ట్రైనింగ్ తీసుకున్నా. ఒకసారి నీటిలోకి వెళ్లిన తర్వాత మూడు నిమిషాలు పైకి రావడానికి ఉండదు. శ్వాసను ఎలా ఆపాలి? అనే దాంతో పాటు యాక్షన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. శారీరకంగా ఎక్కువ కష్టపెట్టిన సినిమా ఇదే. షిప్ మీద యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేసేటప్పుడు తడి తడిగా ఉంటుంది కనుక జారిపోయేది.

ఒక్కోసారి ఒక్క షాట్ చేసిన తర్వాత వేలు లేదా కాళ్ల మీద గాయాలయ్యేవి. బ్యాండేజ్ కట్టుకుని మళ్లీ షూటింగ్ చేసేవాడిని.  హీరోయిన్‌గా దివ్యభారతి పేరును జీ స్టూడియోస్ సూచిం చింది.  అన్ని సినిమాలకు కథను బట్టి సంగీతం ఇస్తున్నా. నా సినిమాల కోసం అంటూ స్పెషల్ వర్క్ ఏమీ చేయను. ఈ సినిమా కోసం కొత్త తరహా సౌండ్ కొన్ని వినిపించే ప్రయత్నం చేశా.

నేను హీరోగా నటించే సినిమాలు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలని రూల్ ఏమీ పెట్టుకోలేదు. మంచి కథ దొరికితే ఇతర హీరోల సినిమాలూ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా.  ‘దసరా’లో నాని కాకుండా మరో పాత్రకు నన్ను అడిగారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా చేయలేకపోయా. మంచి కథ వస్తే తెలుగులో సినిమా చేయడానికి నేను రెడీగా ఉన్నాను.